మాల్యా దర్జా మామూలుగా లేదు

మాల్యా దర్జా మామూలుగా లేదు

వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్ చెక్కేసిన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్ కు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఆయనకు నోటీసులు పంపితే అక్కడ లేరని అవి వెనక్కు వచ్చేస్తున్నాయి. అయితే.. మాల్యా మాత్రం బ్రిటన్ లో దర్జాగా తిరుగుతున్నారు. రీసెంటుగా ఆయన భారత హైకమిషనర్ పాల్గొన్న కార్యక్రమంలోనే పాల్గొనడం ఇప్పుడు దుమారం రేపుతోంది.  ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో ప్రముఖ సామాజికవేత్త సుహెల్ సేథ్ నూతన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాల్యా కనిపించడం సంచలనంగా మారింది.

 బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ నవ్‌తేజ్ సర్నా ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో విజయ్ మాల్యా పాల్గొనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.  మనీ లాండరింగ్ కేసులో నేరస్థుడిగా ముద్ర పడిన మాల్యా అరెస్టుకోసం భారత్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన అలా బహిరంగంగా తిరుగుతున్నా పట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  మరోవైపు మాల్యా పాల్గొన్న ఈ కార్యక్రమానికి భారత హైకమిషనర్ కూడా హాజరుకావడం అనేక సందేహాలను లేవనెత్తుతోంది. సుహెల్ సేథ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాల్యా, నవ్‌తేజ్ సర్నా పాల్గొన్న దృశ్యాలను వార్తా చానళ్లు ప్రసారం చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ గా మారింది.

కాగా దీనిపై  విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటన మరింత విచిత్రంగా ఉంది.  పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన ఎల్‌ఎస్‌ఇ హాల్‌లో ప్రేక్షకుల మధ్య మాల్యా కనిపించిన వెంటనే నవ్‌తేజ్ సర్నా తన ప్రసంగాన్ని ముగించడంతోపాటు చర్చాగోష్ఠి కార్యక్రమం ఆగకుండా వేదిక దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారని విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది.  ఎల్‌ఎస్‌ఇలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాల జాబితాను ఎల్‌ఎస్‌ఇయే ఖరారు చేసినప్పటికీ ఆ జాబితాను భారత హైకమిషనర్‌కు కూడా పంపారని, అందులో విజయ్ మాల్యా పేరు లేదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఆయనెలా వచ్చారో తెలియదని అంటోంది. అంతేకానీ... ఆయన ఆచూకీ తెలిసిన నేపథ్యంలో పట్టుకుని భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేస్తామని మాత్రం చెప్పడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు