కరుణకు మ‌ళ్లీ అవ‌మానం

కరుణకు మ‌ళ్లీ అవ‌మానం

ప్ర‌తికార రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఇంకా అదే తీరు జోరుగా సాగుతోంది. ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత‌ మొద‌టిసారి కొలువుదీరిన త‌మిళ‌నాడు శాసనసభలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం  కరుణానిధికి మ‌ళ్లీ అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న‌ రెండో వరుసలో సీటు కేటాయించిన ముఖ్య‌మంత్రి, స‌భానాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌ త‌న తీరును చెప్ప‌కనే చెప్పారు.

ఇటీవ‌లి ఎన్నికల్లో తిరువారూర్‌ నుంచి ఎన్నికైన కరుణానిధి సభలో తనకు అనువైన సీటు లేనందువల్ల సభకు హాజరు కావడం లేదు. అయితే ఈసారి శాసనసభలో కరుణానిధికి ప్రత్యేకించి ఓ కుర్చీ వేయించాలని డీఎంకే కోరింది. ఆ ప్రకారం కరుణకు ప్రత్యేక చోటును కల్పించి ఉంటారని డీఎంకే భావించింది. అయితే  సీన్ రివ‌ర్స్ అయింది. ఆయ‌న‌కు సభలో రెండో వరుసలో సీటు కేటాయించారు. ప్రతిపక్షంలోని తొలి వరుసలోనే క‌రుణ త‌న‌యుడు స్టాలిన్‌కు సీటు ఇచ్చారు! అయితే కరుణానిధి సభకు రానందువల్ల ఆయన సీటు ఖాళీగానే కనిపించింది. ఇక డీఎంకేలోని ముగ్గురు శాసనసభ్యురాళ్లకు మూడోవరుసలో ప్రత్యేకించి స్థానం కల్పించారు. పొన్ముడి, రంగనాథన్‌, గాంధీ, అన్బరసన్‌, నటుడు వాగై చంద్రశేఖర్‌, ఏవీ వేలు, మొయిద్దీన్‌ఖాన్‌లతో పాటు పలువురు డీఎంకే ప్రముఖులకు వెనుక వరుసలో సీట్లు కేటాయించారు.

క‌రుణానిధికి వెనుక‌వ‌రుస‌లో, ఆయ‌న‌ ముందు వరుసలో స్టాలిన్‌కు చోటు కల్పించడాన్ని పార్టీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప‌రిణామంపై స్టాలిన్ మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి శాసనసభకు వచ్చి వెళ్లేందుకు వీలుగా వసతి, ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేయాలని సభాపతికి వినతిపత్రం అందజేశామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయక‌పోవ‌డం స‌రికాద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు