నక్సలైట్లకూ సెల్ఫీల పిచ్చి

నక్సలైట్లకూ సెల్ఫీల పిచ్చి

ఆయనో కీలక మావోయిస్టు నేత... ఆయన తలపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. కానీ.. పట్టుకుందామంటే పోలీసుల వద్ద ఆయన గురించి సరైన సమాచారమే లేదు. తాజా ఫొటోలూ అందుబాటులో లేవు. కానీ... ప్రపంచమంతా సెల్పీల పిచ్చిలో పడినట్లే ఆ నేత కూడా సెల్ఫీ తీసుకోవాలని మోజు పడ్డారు. మోజు పడడమేంటి.. మావోయిస్టే అయిన తన భార్యతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ సెల్పీ ఫోలీసులకు దొరికింది. ఇంకేముంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఇద్దరు కీలక మావోయిస్టు నేతలున్న ఆ సెల్ఫీని ప్రింట్లు తీసి ఏజెన్సీలో ఎక్కడపడితే అక్కడ అతికించారు. వారు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారమివ్వాలని ఆదేశించారు.

ఏపీలో ఈస్ట్ డివిజన్ మావోయిస్టు కార్యదర్శిగా పనిచేస్తున్న చలపతి అలియాస్ అప్పారావు కీలక మావోయిస్టు నేతల్లో ఒకరు. ఆయన తలపై 20 లక్షల రివార్డు ఉంది. ఆయన భార్య పేరు అరుణ.. ఆమె తలపై 5 లక్షల రివార్డు ఉంది. కొన్నేళ్లుగా వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో ఉంటున్నారు. పోలీసులు వీరికోసం సాగిస్తున్న వేట ఏ మాత్రం ఫలించడం లేదు. అయితే... గత నెలలో విశాఖ జిల్లాలో జరిగిన ఓ ఎన్ కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల కిట్ బ్యాగుల్లో దొరికిన ఓ ల్యాప్ టాప్ వీరికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. అందులో చలపతి, అరుణల సెల్ఫీలున్నాయి. అది పోలీసులకు చిక్కింది. లేటెస్టు ఫొటోలు దొరకడంతో వారిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి సెల్ఫీల పిచ్చి సామాన్యులనే కాదు సాయుధపోరాట యోధులనూ ఇబ్బంది పెడుతోందన్న మాట. అసలు మొబైల్ ఫోన్ల వాడకం వల్లే చాలమంది మావోయిస్టుల ఆచూకీ తెలిసిపోతున్న నేపథ్యంలో కీలక నేతగా ఉన్న చలపతి ఇలా సెల్ఫీలపై మనసు పడడం.. అవి దొరికిపోయి ఇబ్బందుల్లో చిక్కుకోనుండడం ఆశ్చర్యకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు