ఆమె తెలంగాణ ‘ముద్రగడ’ అవుతారా?

ఆమె తెలంగాణ ‘ముద్రగడ’ అవుతారా?

ముద్రగడ అనగానే కాపుల్ని గుర్తు చేసుకుంటే ఇక్కడ తప్పులో కాలేసినట్లే. భావోద్వేగ అంశాల విషయంలో దీక్ష చేయటమే ఇక్కడ అసలుసిసలు పాయింట్. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ గతంలో దీక్ష చేసిన ముద్రగడ ఏపీ సర్కారును ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేశారో తెలిసిందే. తుని విధ్వంసంలో భాగస్వామ్యం ఉందంటూ కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేస్తున్నారు. భావోద్వేగ అంశంపై ఆయన చేస్తున్న తాజా దీక్ష సైతం ఏపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. నిజానికి భావోద్వేగ అంశాలకు ఉండే బలమే అలాంటిది.

తాజాగా ఆ తరహాలోనే ఆమరణ నిరాహారదీక్ష చేయాలన్న లక్ష్యంతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి డీకే అరుణ. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నరు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి డిమాండ్లలో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది డీకే అరుణ డిమాండ్.

జిల్లాగా ప్రకటించటానికి గద్వాల్ కు అన్ని అర్హతలు ఉన్న నేపథ్యంలో.. తాము కోరినట్లుగా జిల్లాగా ప్రకటించాలని అరుణమ్మ డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ ను వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి విన్నవించిన ఆమె.. కొత్త జిల్లాల్లో తాను కోరిన గద్వాల్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు. ఒకవేళ.. గద్వాల్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయని పక్షంలో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవాలని ఆమె ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ కానీ.. అరుణమ్మ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే.. ఆమె నిరసన మరో ముద్రగడ ఎపిసోడ్ ను తలపించటం ఖాయమంటున్నారు. కొత్త జిల్లాగా తాము ఏర్పడాలని గద్వాల్ వాసులు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.