మాజీ సీఎం కొంపముంచుతున్న ఔరంగజేబు పోలిక

మాజీ సీఎం కొంపముంచుతున్న ఔరంగజేబు పోలిక

తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవడం తృటిలో కోల్పోయిన డీఎంకేలో ప్రస్తుతం ఔరంగజేబు వ్యవహారం చిచ్చుపెట్టింది. పార్టీ అధినేత కరుణానిధిని ఔరంగజేబుతో పోలుస్తూ స్టాలిన్ బంధువు ఒకరు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు ఒకటి వివాదాస్పదంగా మారింది. 'అవసానదశ వరకు ఔరంగజేబు అధికార పీఠాన్ని వీడకపోవడం వల్లే ఆయన మరణానంతరం వారసులకు పాలనాదక్షత తెలియలేదు. అందుకే మొఘల్ సామాజ్య్రం పతనమైపోయింది" అంటూ చేసిన విమర్శపై కరుణానిధి మద్దతుదారులు తమదైన శైలిలో తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రస్తుతం డీఎంకేలో కరుణ, స్టాలిన్ వర్గీయుల్లో అంతర్యుద్ధం మొదలైంది.

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో స్టాలిన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సామాజిక మాధ్యమాల ద్వారా డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసిన తరుణంలోనూ వారిలో కొందరు ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశేషిస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు కొనసాగిస్తున్నారు. అందులో కొన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని దెప్పిపొడిచేవిగా ఉండటంతో ఆ చర్చలు వివాదాస్పదంగా మారుతున్నాయి. స్టాలిన్ బంధువైన సౌమ్య వైద్యనాథన్ తన ఫేస్బుక్ పేజీలో ఔరంగజేబుతో కరుణానిధిని పోలుస్తూ చేసిన విమర్శ సామాజిక మాధ్యమాల్లో కార్చిచ్చులా రగులుకుంది. వివాదాస్పదమైన ఆ వ్యాఖ్య ఏంటంటే... 'ఔరంగజేబుకు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనమైనట్లు చదివే ఉంటాం. ఔరంగజేబు కాలం వరకు పటిష్ఠంగా ఉన్న మొఘల్ సామ్రాజ్యం ఆ తర్వాత ఎందుకు పతనమైంది? 92 ఏళ్ల పాటు బతికిన ఆయన తన జీవిత చరమాంకం వరకు అన్ని విషయాలను తన ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రభుత్వ నిర్వాహకులు, కుమారులు ఆయన వద్ద మాట్లాడేందుకే భయపడేవారు. అందువల్ల తర్వాతి సంతతికి పరిపాలనలో తగిన అనుభవం లభించే అవకాశం లేకుండా పోయింది. ఇదే ఔరంగజేబుకు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనానికి కారణమైంది" అంటూ ఉంది. కరుణానిధిని లక్ష్యంగా చేసుకుని ఈ విమర్శలు ఎక్కుపెట్టారు. ఔరంగజేబు 88 సంవత్సరాలు బతికినట్లు చరిత్ర చెబుతుండగా సౌమ్య వైద్యనాథన్ మాత్రం 92 సంవత్సరాలు అంటూ పేర్కొనడం అంటే కరుణానిధి వయస్సును దృష్టిలో పెట్టుకుని అందులో రాశారనే ఆరోపణలు ఉన్నాయి.

సౌమ్యవైద్యనాథన్ విమర్శలను తిప్పికొట్టేందుకు కరుణానిధి సానుభూతిపరులు కంకణం కట్టుకున్నారు. వీరిలో సాయి లక్ష్మికాంత్ అనే నేత ఓ అడుగు ముందుకేసి 'ఔరంగజేబు తన కుమారుడికి ఉపరాజ పదవిని ఇవ్వలేదని అనుకుంటున్నాను" అంటూ తిప్పికొట్టారు. గతంలో స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయాన్ని, ప్రస్తుతం శాసనసభ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు చెబుతున్నారు. 'అయినా ఔరంగజేబు ఇంటి కుమారుల్లా ... స్టాలిన్ రాజకుమారుడు కాదు" అంటూ మరో చురక అంటించారు. కరుణానిధి సూచనల మేరకే సాయిలక్ష్మికాంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరుగుతున్న పార్టీ నాయకుల మార్పులకు ఇదే కారణమనే అభిప్రాయాలూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లోని ఈ చర్చ ప్రస్తుతం డీఎంకేలోనూ తండ్రీకొడుకుల వర్గాల మధ్య చిచ్చుపెట్టిందని, ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

ఇదిలాఉంండగా...డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేతికి అప్పగించాలని, కరుణానిధి రాజయకీయ వారసుడిగా ఆయనను బహిరంగంగా ప్రకటించాలని స్టాలిన్ వర్గీయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే నినాదం తెరపైకి రాగా కరుణానిధి తన చాణక్యంతో దానిని ఆదిలోనే తుంచేశారు. ఎన్నికల్లో డీఎంకే బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించగా ప్రతిపక్ష నేతగా స్టాలిన్ పేరు ప్రకటించడం వెనుక కరుణపై ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. 93 ఏళ్ల వయోధికభారంతో ఉన్న కరుణానిధి శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనువైన కుర్చీని ఏర్పాటు చేయాలని సభాపతికి లేఖ కూడా సమర్పించారు. ప్రస్తుతం దీనిపై స్టాలిన్ సానుభూతిపరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో తెరపైకి రావడంతో వివాదాస్పదంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English