షాక్: సీఎల్పీకి జానా గుడ్‌బై?

షాక్: సీఎల్పీకి జానా గుడ్‌బై?

పార్టీకి చెందిన‌ సీనియ‌ర్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, త‌న అనుచ‌రుడు అయిన ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌తో పాటు మ‌రికొందరు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పాలని కీలక నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ విలవిల్లాడుతోంది. దీనిపై పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, సీఎల్పీ ఉప‌నేత‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండ‌లి ఫ్లోర్ లీడ‌ర్‌ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. త‌న కాంగ్రెస్ శాసనసభా పక్ష పదవికి, మిగిలిన అన్ని పదవులకూ రాజీనామా చేస్తానని కె జానారెడ్డి ప్రకటించి సంచలనం రేపారు.

ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ  టీఆర్ఎస్ అధినేత అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు. “రాష్ట్రం సాకారం కావడంపై అందరం సంతోషించాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు అభివృద్ధిలో సహకరిస్తున్నాం..సహకరిస్తూనే ఉంటాం. అయితే పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే.. దీనిపై గతంలోనే చాలా సార్లు హెచ్చరించాం. ఒక పార్టీ వారిని ప్రలోభపెట్టి లొంగదీసుకుని, ఆ పార్టీని బలహీనపర్చడం చాలా హేయమైన చర్య అనీ, సరైంది కాదన్నాం. ఆయన వినలేదు. తన ఎజెండాతో ముందుకుపోయారు. అభివృద్ధి ముసుగులో అనైతికంగా వ్యవహరిస్తూ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణం. తాజాగా మా పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన సమయంలో టీఆర్ఎస్ తగిన గుణపాఠం చెబుతారు” అని జానారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై విద్యార్ధులు, అధ్యాపకులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు జానా. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అండగా ఉండాలన్నారు.

"తాజా పరిణామాలు నాకు వేదన కల్గించాయి. ముఖ్యంగా అధికార పార్టీ అనుసరిస్తున్న తీరు. ఎందుకు నాకీ పదవులు అనిపించింది. ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులను త్యాగం చేయాలని నిర్ణయించాం. దీనిపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తో మాట్లాడాక తుదినిర్ణయం తీసుకుంటాం. నాకు పదవులపై ఆశలేదు. ఇంత కంటే పెద్ద పదవి ఇచ్చినా అక్క‌ర్లేదు. సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. అందుకు కృతజ్ఞుణ్ణి. కానీ అటు కేసీఆర్ గానీ, తెలంగాణా మేధావులు, ప్రజలు గానీ ఒక్క విషయం ఆలోచించాలి. మనం కోరుకుంటున్న బంగారు తెలంగాణా ఇదేనా ? ఫిరాయింపులతో బంగారు తెలంగాణా వస్తుందా ? భ్రష్ట తెలంగాణా వస్తుంది.. బంగారు తెలంగాణా కాదు. ఈ భ్రష్ట తెలంగాణా రావాలని, సామాజిక, ప్రజాస్వామిక న్యాయం లేని తెలంగాణా కావాలని మనమేనాడైనా కోరుకున్నామా? " అని జానారెడ్డి ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English