బీజేపీతో తెగతెంపులేనన్న బాబు

బీజేపీతో తెగతెంపులేనన్న బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు కొత్తగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం నాయకులతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు తెలంగాణ తమ్ముళ్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణలోపార్టీని బలోపేతం చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను విచ్చీన్నం చేసే కుట్రకు కేసీఆర్ దిగుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ ఎత్తుగడతో కాంగ్రెస్ ఇప్పటికే కుదేలయిపోయిందని, ఇక ఆ పార్టీ బలపడే అవకాశాలు లేవని చంద్రబాబు విశ్లేషించారు. బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందుకు సరైన అవకాశాలు లేవని పేర్కొన్నారు. అందుకే కార్యకర్తల బలమున్న పార్టీగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిత్రపక్షమైన బీజేపీతోనే సమస్య అనుకుంటే ఆ పార్టీకి దూరంగా ఉంటూ సొంత కార్యక్రమాలను రూపొందించుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక ప్రారంభమయిందని పేర్కొన్న చంద్రబాబు ఈ వ్యతిరేకతను ఉపయోగించుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులపై వస్తున్న అసంతృప్తులను రూపొందించి ఉద్యమం చేపట్టాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోని అవినీతిని ప్రశ్నించాలని బాబు ఈ సందర్భంగా ఉద్బోధించారు. చంద్రబాబు సూచనల నేపథ్యంలో బీజేపీతో చెలిమి ఇక ముగిసిన అధ్యాయమేనని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు