తెలంగాణకు సేమ్ షాక్ ఇచ్చిన అమిత్ షా

తెలంగాణకు సేమ్ షాక్ ఇచ్చిన అమిత్ షా

ఏపీలో బీజేపీ, టీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ టీడీపీ.. అంతా మేమే ఇస్తున్నామంటూ బీజేపీ ఎవరికి వారు వాదించుకుంటున్నారు. లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు లెక్కలు చెబుతుండగా.. అదంతా బోగస్ అని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే.. ఈ కోటలు దాటుతున్న కేంద్రం సాయం లెక్కల వెనుక కథంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాయే నడిపిస్తున్నారని తేలింది. ఆయన సూచనతోనే ఏపీ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కేంద్రం తెగ డబ్బులు కుమ్మరిస్తోందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ విషయంలోనూ అమిత్ షా అదే పాట పాడేసరికి ఈ తతంగాలు నడిపిస్తున్నదంతా ఆయనేనని తేలిపోయింది. సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ వికాస్ పర్వ్ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం చేసిన సాయం లెక్కల గురించి చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలోని వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఇప్పటివరకు 90 వేల కోట్ల రూపాయలను ఇచ్చిందని, ఆ నిధులు ప్రజలకు అందడంలేదంటూ ఆయన ఫైరయ్యారు. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా వుందని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తేల్చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందదని కూడా అమిత్ షా వ్యాఖ్యానించడంతో బీజేపీ వర్గాల్లో వేడి మొదలైంది.

చాలాకాలంగా బీజేపీ, టీఆరెస్ ల మధ్య సయోధ్య లేనప్పటికీ కొద్దికాలంగా సంబంధాలు మెరుగుపడ్డాయి. ఒక దశలో కేంద్ర ప్రభుత్వంలో టీఆరెస్ చేరుతుందని కూడా భావించారు. కానీ... తాజాగా అమిత్ షా చెప్పిన నిధుల లెక్కతో టీఆరెస్ కు కోపం నషాలానికి అంటుతోంది. అసలే కోదండారం రూపంలో ప్రభుత్వానికి పెనుసవాల్ తయారవుతున్న తరుణంలో అమిత్ షా కూడా తాము 90 వేల కోట్లు ఇచ్చినా అది ప్రజలకు అందలేదని చెప్పడం తమకు నష్టం కలిగిస్తుందని టీఆరెస్ భయపడుతోంది.

దీంతో నష్ట నివారణ చర్యగా టీఆరెస్ మంత్రులు రంగంలోకి దిగి అమిత్ షా ఆరోపణలను తిప్పికొడుతున్నారు. మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదని టీఆరెస్ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు మండిపడ్డారు. అమిత్ షా తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మొత్తానికి ఇప్పటికే కోదండం దెబ్బకు కుదేలైన టీఆరెస్ కు అమిత్ షా గట్టి షాకే ఇచ్చినట్లయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు