ఆమెను కలిశారు.. అడ్డంగా బుక్కయ్యారు

ఆమెను కలిశారు.. అడ్డంగా బుక్కయ్యారు

చంద్రబాబు, పురందేశ్వరిలు ఉప్పునిప్పులా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా ఏపీ సచివాలయ ఉద్యోగులు రాంగ్ స్టెప్ వేశారు.  వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న వారు అందులో భాగంగా తమ తరఫున గళం వినిపించాలంటూ బీజేపీ నేత పురందేశ్వరిని కలిశారు. అసలే చంద్రబాబు ఆమె అంటే మండిపడతారని తెలిసి కూడా వారెందుకు కలిశారో తెలియదు కానీ ఆ దెబ్బకు చంద్రబాబుకు నిజంగానే కోపమొచ్చేసింది. తన శత్రువును కలవడంతో చంద్రబాబుకు వారి పట్ల ఉన్న సాప్టుకార్నర్ పోయిందని చెబుతున్నారు. అందుకే ఇంతకాలం వారిని బతిమాలిన చంద్రబాబు ఇప్పుడు  ఈనెల 27 లోపున అమరావతికి తరలి రావాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహా యంపులూలేవని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సచివాలయ ఉద్యోగులను గట్టిగా హెచ్చరించారని చెబుతున్నారు.

ఏపి గెజిటెడ్‌ ఆఫీసర్ల ఫోరం నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తరలిరావడానికి కొన్ని ఇబ్బందు లున్నాయని, తమకు ఆరు నెలల సమయం కావాలని వారు కోరారు. అయితే... అంతకుముందు వారు పురందేశ్వరిని కలిసిన సంగతి తెలుసుకున్న చంద్రబాబు వారిపట్ల సీరియస్ అయ్యారు. తరలింపు విషయంలో ఏ సమస్యలున్నా తననే సంప్రదించాలని స్పష్టం చేశారు. తరలింపు విషయంలో ఎవరినో కలిస్తే ప్రయోజనం ఉండదని చెప్పేశారు.  

కాగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని.. కనీస సౌకర్యాలు లేని రాజధానికి ఉన్న పళంగా వెళ్లమనడం భావ్యం కాదని ముఖ్యమంత్రికి వారు తెలిపారు. అనేక శాఖల్లో ఇంతవరకు ఉద్యోగుల విభజన పూర్తికాలేదని, జోనల్‌ క్యాడర్‌ విషయంలో ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని..  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అద్దె భవనాల్లో ఉండటం వల్ల వందకోట్లు ఆర్థిక భారం ఉంటుందని చెప్పారు. అయితే.. అన్నీ విన్న తరువాత చంద్రబాబు ఈ నెల 27లోగా వచ్చేయండని వారితో అన్నారు.  దీంతో పురందేశ్వరిని కలిసి పొరపాటు చేశామని ఉద్యోగులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు