పవన్ మైల్ స్టోన్‌ను దాటేసిన వీరాభిమాని

పవన్ మైల్ స్టోన్‌ను దాటేసిన వీరాభిమాని

తెలుగు పరిశ్రమలో పవన్ కళ్యాణ్‌కు అతి పెద్ద అభిమాని ఎవరంటే మరో మాట లేకుండా నితిన్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. పవన్ పేరు చెబితే నితిన్ ఎంతగా ఉప్పొంగిపోతాడో.. ఊగిపోతాడో.. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి పవన్ కళ్యాణ్ కెరీర్లో ల్యాండ్ మార్క్ లాగా నిలిచిన సినిమా వసూళ్లను తన సినిమా దాటేస్తే నితిన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ఫీలింగ్‌నే అనుభవిస్తున్నాడు నితిన్.

పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేది' అమెరికాలో సాధించిన కలెక్షన్లను నితిన్ లేటెస్ట్ మూవీ 'అఆ' దాటేసింది. అత్తారింటికి దారేది ఫుల్ రన్లో 1.896 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. 'అఆ' 8 రోజుల్లోనే ఆ మార్కును దాటేసింది. గత గురువారం విడుదలైన ఈ చిత్రం.. ఈ గురువారం నాటికి 1.91 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం 2 మిలియన్ మార్కును దాటడం లాంఛనమే. రెండో వారం కూడా 90కి పైగా స్క్రీన్లలో రన్ అవుతున్న 'అఆ' 2.5 మిలియన్ మార్కును కూడా అందుకునే అవకాశముంది.

అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా 'బాహుబలి'. ఆ చిత్రం ఏకంగా 8.46 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. 'శ్రీమంతుడు' 2.89 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. 'నాన్నకు ప్రేమతో' 2.02 డాలర్లను మూడో స్థానంలో ఉన్నాయి. 'అఆ'.. 'నాన్నకు ప్రేమతో'ను కూడా దాటేసి మూడో స్థానంలో నిలవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు