సూటి ప్రశ్నః గవర్నర్ నరసింహన్ వంకాయలు కోస్తున్నారా?

సూటి ప్రశ్నః గవర్నర్ నరసింహన్ వంకాయలు కోస్తున్నారా?

సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మరోమారు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానల్తో ప్రత్యేకంగా మాట్లాడిన నారాయణ ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాల్లోని పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు పరిపాలన మానేసి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల ఆపరేషన్ ఆకర్ష్ ఎపిసోడ్తో పార్టీలు మారుతున్నవారంతా ఒఠ్ఠి బడుద్ధాయిలని నారాయణ వ్యాఖ్యానించారు .

"ఏపీలో అధికార టీడీపీ సైకిలెక్కుతున్నవారు, ఇక్కడ గులాబీ కండువా కప్పుకొంటున్న బడుద్ధాయిలు బయటకి వచ్చి ఏం చెబుతున్నారు?.. మేం ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, బంగారు తెలంగాణా, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం పార్టీ మారుతున్నామంటున్నారు. వారి రాజకీయ పబ్బం గడుపుకోడానికి గోడదూకుతూ ఈ మాటలెందుకు చెప్పడం? " అని నారాయణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇద్దరు సీఎంలు దోచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్న నిర్మాణాలను కూలగొట్టి, తవ్విన కాలువలు పూడ్చి కొత్త నిర్మాణాల పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంలో హోల్ సేల్ గా వ్యాపారం మొదలెట్టేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇరు రాష్ర్టాల అభివృద్ధి కోసం అంటూ కేసీఆర్, చంద్రబాబు ఇస్తున్న స్టేట్ మెంట్ల యుద్ధం డ్రామా అని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ర్టాల పాలకులుగా ఇద్దరు సీఎం గొడవ పడుతున్న సమయంలో వారికి నచ్చ చెప్పాల్సిన గవర్నర్ గారు వంకాయలు తరుగుతున్నారా.. నారాయణ నిలదీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు