బిగుసుకుంటున్న ముద్రగడ ముసలం

బిగుసుకుంటున్న ముద్రగడ ముసలం

కాపు ఉద్యమ నేత... తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండు చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం తన మొండి పట్టుదలను ఇంకా విడనాడలేదు. రాజమండ్రి ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడ ఇంకా తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయించుకోడానికి ఆయన ససేమిరా అంటున్నారు.   ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అంతే పట్టుదలగా దీక్ష కొనసాగిస్తున్నారు.  ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలోని 202 నంబరు రూమ్‌లో ముద్రగడను ఉంచారు.  వైద్యులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన చికిత్సకు నో చెబుతున్నారు.  కనీసం వైద్య పరీక్షలకు కూడా ఆయన అంగీకరించకపోవడంతో నిన్న సాయంత్రం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేకపోయారు. అయితే.. ముద్రగడ పరిస్థితి ఏంటన్నది బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. పేషెంట్లు, అధికారులు మినహా ఎవరినీ ఆస్పత్రిలోకి రానివ్వడం లేదు. మరోవైపు తన డిమాండ్ నెరవేర్చేవరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు కూడా జరపబోనంటూ భీష్మించుకు కూర్చున్నారు.

మరోవైపు ముద్రగడ అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాలో 124 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మడివరం.. ఇలా పలు ప్రాంతాల్లో కులసంఘాల నాయకులను కూడా ముందస్తుగా అరెస్టు చేశారు. మరికొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో బంద్‌ను విఫలం చేయడానికి బలవంతంగా దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు దుకాణాలను తెరిపిస్తున్నా దుకాణదారులు మాత్రం మళ్లీ వాటిని మూసేస్తున్నారు. అల్లర్లు, ఆందోళనలు చెలరేగితే తమ దుకాణాలకు, ఆస్తిపాస్తులకు ముప్పు వస్తుందన్న భయంతో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారని పోలీసులు అంటున్నారు.

కాగా చంద్రబాబు ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉందని.. వారికి అన్ని విధాలుగా న్యాయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందంటున్నారు. అరెస్టు చేసినవారంతా తుని విధ్వంసంలో పాల్గొన్నవారేనని.. అమాయకులేమీ కాదని.. అలాంటివారికి ముద్రగడ మద్దతు పలకడం కరెక్టుకాదంటూ పద్మనాభం వైఖరిని వారు తప్పుపడుతున్నారు. అయితే, ముద్రగడ మాత్రం మెట్టు దిగకపోవడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందా అన్నట్లుగా తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు