నమోనమహ..అనుకుంటే సరిపోతుందా?

నమోనమహ..అనుకుంటే సరిపోతుందా?

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చాలా ఆనందంగా వుండి వుండొచ్చు. ప్రధాని పదవికి పోటీ పడుతున్న భాజపా నాయకుడు మోడీ తన తొలి ప్రచార సభకు హైదరాబాద్ ను ఎందుకోవడం ఓ అవకాశం. అది అద్భుతంగా విజయవంతం కావడం మరీ సంతోషకరమైన సంగతి. రేపు అదృష్టం బాగుండి మోడీ ప్రధాని అయితే కిషన్ రెడ్డి అంతకు అంతా ప్రతిఫలం అందుకునే అవకాశం వుంది. పైగా ఇదే సమయంలో తెలంగాణా ప్రకటన వచ్చింది కూడా. మరి ఇంతకన్నా కిషన్ రెడ్డి సంతోషం రెట్టింపు కావడానికి కావాల్సిన కారణాలేముంటాయి?

అయితే ఇక్కడ కొన్ని నిష్టూరమైన అంశాలు కూడా కొన్ని వున్నాయి. సాక్షాత్తూ మోడీ మహాశయుడే, హైదరాబాద్ పార్టీ సమావేశంలో మట్లాడుతూ, ‘కేవలం నా ఒక్కడి ప్రతిభతో గుజరాత్ లో అధికారం సిద్దించలేదు...గాలి బయట ఎంత వున్నా, ట్యూబులోకి ఎక్కించాలంటే పంపు సహకారం కావాలి’ అని చెప్పనే చెప్పారు. మోడీ మహా తెలివైన రాజకీయవేత్త. మేనేజ్ మెంట్ విద్యలో చంద్రబాబుకు తాత. ఆయన హైదరాబాద్ రాక ముందే ఇక్కడి పార్టీ పరిస్థితులు ఆయనకు తెలియనవి కావు. అవన్నీ ఆకళింపు చేసుకుని, ఆయన కార్పొరేట్ స్టయిల్ జనాల చేత లెక్కలు తెప్పించుకుని, గుణించుకున్న మీదటే ఇక్కడకు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నిర్మాణం ఎంత అథోగతిలో వుందో ఆయనకు తెలియంది కాదు.

పేరుకు ప్రతి జిల్లాకు ఓ కార్యవర్గం, అనుబంధ సంఘాలు వుండి వుండొచ్చు. కానీ, ఎందుకు ఎన్నికలకు అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి వుంది. తెలంగాణాలో ఇవ్వాళ వేర్పాటు ఉద్యమం పుణ్యమా అని నలుగురు నాయకులు వచ్చి వుండొచ్చు. అదే విధంగా చిరకాలంగా విప్లవ సంఘాలకు ఎదురొడ్డి పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ పుణ్యమా అని నలుగురు కార్యకర్తలు వుండి వుండొచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి లేదు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు చాలా వున్నాయి.

అసలు సహజంగా భారతీయ జనతాపార్టీకి కార్యకర్తలంటూ వేరుగా లేరు. దాని మాతృసంస్థ జనసంఘ్ వున్నప్పటి నుంచీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలే దీని కార్యకర్తలుగా వుంటూ వచ్చారు. నాయకుల జన్మస్థలం కూడా ఆరెస్సెస్సే. అయితే ఎనభయ్యవ దశకం నుంచీ ఆంధ్రలో ఆరెస్సెస్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. అదే సమయంలో విద్యార్థి ఉద్యమాలు కూడా తగ్గాయి., దీంతో ఇటు ఎబివిపి కార్యకర్తలు కూడా తగ్గారు. మరోపక్క  నుంచి కొమ్ము కాస్తూ వున్న విశ్వహిందూ పరిషత్ కు కొత్తబలం అంటూ పెద్దగా చేకూరలేదు. ఆరెస్సెస్ లో లేదా, ఎబివిపిలో సీనియర్లు అటు మళ్లారంతే. దానా దీనా బిజెపికి వెన్నదన్నుగా వున్న ఈ అనుబంధ సంఘాలు కొత్తగా తమ బలాన్ని పెంచుకోవడంపై పెద్దగా దృష్టి సారించలేకపోయాయి లేదా ఆ దిశగా విజయం సాధించలేకపోయాయి. మరోపక్క నిన్నటి తరం కార్యకర్తల వయసు యాభైలు దాటింది. ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడిపోయారు. అభిమానాలే తప్ప, ఆచరణకు సమయం కేటాయించేంత లేదు అక్కడ. మరోపక్క వెంకయ్యనాయుడు సారథ్యంలోకి రాష్ట్ర పార్టీ వ్యవహారాలు వెళ్లిన కొత్తలొనే ఇమడలేక దూరమైన వారు వుండనే వున్నారు. ఇక్కడ వెంకయ్యనాయడు తప్పిదాలు కూడా వున్నాయనే చెప్పాలి. గతంలో అధికారం అందినపుడు ఆయన తెచ్చినవారు, లేదా వచ్చిన వారు అంతా వ్యపారవర్గానికి చెందిన నాయకులే ఎక్కువ. వీరంతా ఎక్కడ నీరు ఎక్కువ వుంటే అక్కడ చేరే రకం. సిద్ధాంతపరమైన స్థిరత్వం వున్నవారు కాదు. కానీ సామాజిక సమీకరణల రీత్యా వెంకయ్యనాయుడు వీరిని చేరదీసి వుండొచ్చు..లేదా వీరు చేరి వుండొచ్చు. ఎప్పుడైతే కేంద్రంలో అధికారం చేజారిందో ఇలా వచ్చిన కొత్తనీరంతా వెనక్కు వెళ్లిపోయి, తమ తమ పనులు చక్కబెట్టుకోవడంలో మిగిలిపోయారు. మహా అయితే ముఖ్యమైన సమావేశాలకు మాత్రం మొహం చూపించడం జరిగింది. ఇలాంటపుడు పార్టీ నిర్మాణం  ఎలా సాధ్యమవుతుంది.

ఇప్పుడు మోడీ హడావుడి చూసి అదే వ్యాపర, సామాజిక వర్గాలు మళ్లీ పార్టీ దిశగా క్యూ కడుతున్నాయి. కానీ వీరు నాయకత్వం వహించగలరు కానీ ఓట్లు వేయించే సామర్థ్యం వున్నావారు కాదు. పోనీ మోడీ హవా నడుస్తోంది కాబట్టి పట్టణ ప్రాంత ఓటర్లు స్వచ్ఛందంగా భాజపాకు ఓటు వేస్తారని అనుకుందాం. ఆ విధంగా ఎమ్మెల్యే, ఎంపీలకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఆశిద్దాం. కానీ మళ్లీ అభ్యర్ధుల ఎంపిక దగ్గరకు వచ్చేసరికి నిస్పక్షపాత ఎంపిక ఎక్కడ వుంటుంది. వెంకయ్య తనకు కావాల్సిన తన వారిని ఎంచుకోవడంతోనే సరిపోతుంది. గతంలో విశాఖ నుంచి ఒక్కసారి ఉన్నట్లుంది కంభంపాటి హరిబాబును దింపినట్లు. సహజంగా పార్టీని అంటిపెట్టుకున్న వర్గాలు, కార్యకర్తలు ఈ పరిస్థితిని జీర్ణించుకునే స్థితిలో లేరు. అందువల్ల వారు ఎప్పటిలా స్తబ్ధుగా వుండిపోతారా? లేక తమ వంతు ఓటు వేసి ఊరుకుంటారా అన్నది ఓ ప్రశ్న.

ఇక మోడీకి వస్తున్న ప్రచారంలో సోషల్ నెట్ వర్క్, మీడియాదే ప్రధాన పాత్ర.  ఇందులో యువకుల పాత్ర మరీ కీలకం. దానివల్ల పట్టణ ప్రాంత ఓటర్లపై ప్రభావం కనబరచవచ్చు కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లపై కాదు. కానీ పోలింగ్ జరిగేది ఆ గ్రామీణ ప్రాంతాల్లొనే. అంటే అక్కడ మళ్లీ ఓటింగ్ జరిపించడానికి, మోడీ చరిష్మాను ఆ ప్రాంతాల్లోకి చేర్చాలంటే సంస్థాగతంగా బలం కావాలి. ఇందుకోసం ఇప్పటికిప్పుడు కసరత్తు ఫ్రారంభించినా కనీసం ఆరు నెలలు పడుతుంది. అది చేయమనే మోడీ కార్యకర్తల సమావేశంలో చెప్పింది. అది జరగకుంటే, ఎంత హవా వున్నా పలితం అంతంతమాత్రం. ఆ వైనం ఆలోచిస్తే మాత్రం, భాజపా రాష్ట్ర నాయకత్వం, తమ సభ విజయం తెచ్చిన సంతోషాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, కార్యరంగంలోకి దూకాల్సి వుంటుంది. అలా కాక, మోడీ ఫొటోలను, అది తెచ్చే ఓట్లను అంచనా వేసుకుంటూ కలల్లో తెలిపోతే మాత్రం, ఆ తరువాత వగచాల్సి వుంటుంది.