కంగారెత్తిస్తున్న కాపు కింగ్

కంగారెత్తిస్తున్న కాపు కింగ్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన తీరుతో ప్రభుత్వాన్ని, పోలీసులను హడలెత్తిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లే గురువారం నిరాహార దీక్షకు దిగిన ఆయన తాజాగా మరిన్ని బెదిరింపులకు దిగారు. చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని దీక్షకు కూర్చున్నారు. దీంతో దీక్ష భగ్నానికి యత్నించిన పోలీసులు వెనక్కు తగ్గారు.. మరోవైపు తనను గృహ నిర్బంధం చేయడం పట్ల ముద్రగడ పోలీసులపై మండిపడుతున్నారు. కాపుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని తేల్చి చెబుతున్నారు. మరో వైపు వైద్య పరీక్షలు చేసేందుకు వైద్యులు ఆయన నివాసానికి రాగా ఆయన ఏమాత్రం సహకరించలేదు.

కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయడంతో పాటు తుని విధ్వంసకారులుగా పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్ తో ముద్రగడ ఈ దీక్షకు దిగారు.  తన సొంతింటిలోనే దీక్షకు కూర్చున్నారు.  తన దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కూడా కిర్లంపూడి రావద్దని పిలుపునిచ్చిన ముద్రగడ.. ఆయా ప్రాంతాల్లో మునుపటిలాగే కంచం, గరిట పట్టి శబ్దం చేస్తూ నిరసన తెలపాలని కోరారు. అదే సమయంలో తాను సంప్రదింపులకు కూడా సిద్ధంగా లేనని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించేది లేదని చెప్పిన ముద్రగడ కాపు జాతి కోసం తాను  ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని సంచలన ప్రకటన చేశారు. తన దీక్ష భగ్నం చేయాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అందుకోసమే ఆయన తన వద్ద పురుగుల మందు డబ్బా పెట్టుకుని కూర్చున్నారు. దీంతో ఒక్కసారిగా  కిర్లంపూడిలో హైటెన్షన్ నెలకొంది. ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వెళ్లడం వల్లే ఆయన పురుగుల మందు డబ్బా పట్టుకున్నారని అంటున్నారు.  తాజా పరిణామాలతో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కాపులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు