2019 ఏపీ అసెంబ్లీ బరిలో తెలంగాణ ఎమ్మెల్యే..!

2019 ఏపీ అసెంబ్లీ బరిలో తెలంగాణ ఎమ్మెల్యే..!

ఆ ఎమ్మెల్యే చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రాథినిత్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం తెలంగాణలో ఉంది. అయితే ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏపీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అసెంబ్లీకి వెళుతున్నారు. అయితే ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మాత్రం ఆయన్ను ఏపీకి చెందిన ఎమ్మెల్యేగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ? ఏపీ నుంచి పోటీ చేస్తారా ? అంటే ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారనే సమాధానాలు వస్తున్నాయి. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ? ఏమా కథ చూద్దాం.

 భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ? అంటే సీపీఎం నా యకుల సమాచారం మేరకు అది నిజమేననిపిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాథినిత్యం వహిస్తున్న ఆయన్ను సీపీఎం అధిష్టానం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు డివిజన్ కమిటీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యుడిగా నియమించింది.

 ఇప్పటి వరకు పోలవరం ముంపు మండలాల్లో పార్టీ తరపున పెద్దన్నగా వ్యవహరించిన మాజీ ఎంపీ మిడియం బాబూరావును పార్టీ అధిష్టానం అక్కడ నుంచి రిలీవ్ చేసి ఆ బాధ్యతలను రాజయ్యకు అప్పగించింది. ఇక రాజయ్య కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో తరచూ పోలవరం ముంపు మండలాలైన వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల్లో పర్యటిస్తున్నారు.

 రాజయ్య స్వగ్రామం సున్నంవారిగూడెం కూడా ఏపీలోనే ఉంది. 2019లో రాజయ్య ఏపీ అసెంబ్లీకి రంపచోడవరం నుంచి పోటీ చేస్తారన్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పార్టీ నిర్ణయం మేరకు పనిచేసే వ్యక్తినని... తాను ప్రజల కోసం ఎన్నికలు, పదవులతో సంబంధం లేకుండా పోరాటాలు చేస్తుంటానని తెలిపారు. ఇక తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఆంధ్రాలో కూడా ఉండడంతో వారి తరపున కూడా పోరాడుతున్నానని...వారి సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తనకు ఉందని...ఇందులో రాజకీయ కోణం లేదని ఆయన చెప్పారు. రాజయ్య వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఆయన చూపంతా వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీపైనే ఉన్నట్టు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English