కోదండరాంకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట

కోదండరాంకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట

తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెనర్‌ కోదండరామ్‌ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. తాజాగా కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు తాను రెండు సార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మరికొద్దిసేపట్లో జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.  జేఏసీ తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి పంపుతున్నా.. మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియడం లేదని కోదండరాం అన్నారు. తనపై వస్తున్న విమర్శలకు జేఏసీ నేతలే స్పందిస్తారని ఆయన చెప్పారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థికపరమైన వ్యత్యాసం పెరిగిపోతుందన్న విషయాన్నే తాను చెప్పానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలకు సంబంధించి అవసరమైతే రికార్డులు పరిశీలించుకోవచ్చని కోదండరాం సూచించారు

తనను టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలకు తాను వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వడం కానీ, ప్రతి వ్యాఖ్యలు చేయడం కానని కోదండరాం అంటున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన విమర్శలపై జేఏసీనే స్పందిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనపై కుల ముద్ర వేయడంపైనా ఆయనేమీ స్పందించలేదు. అయితే... జేఏసీ సమావేశం నేపథ్యంలో అక్కడ ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కోదండరాంకు మద్దతుగా ఓయూ జేఏసీ తీవ్రంగా స్పందించింది. కేసీఆర్ ప్రభుత్వంతో కోదండరాంకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణ చేస్తూ ఆయనకు కేంద్రం రక్షణ కల్పించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేయడం తెలిసిందే.  కోదండరాంపై ఉద్యమ ద్రోహి అని ముద్ర వేయడం తగదని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి లాంటి మంత్రులతో కోదండరాంపై విమర్శలు చేయించడం కేసీఆర్ కు ఏమాత్రం తగదంటూ ఓయూ జేఏసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు