కోదండరాంపై కుల ప్రయోగం

కోదండరాంపై కుల ప్రయోగం

తెలంగాణ ప్రభుత్వంతో తలపడుతున్న ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంపై టీఆరెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఆయన్ను కులంపేరుతో సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సాధారణ రాజకీయ నేతలను విమర్శించినట్లుగా కోదండరాంపైనా ఇలా కుల రాజకీయాల ముద్ర వేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీని వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని.. లేదంటే చోటామోటా నేతలు కోదండరాంను ఆ స్థాయిలో విమర్శించే పరిస్థితి ఉండదని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై కోదండరాం విమర్శలు చేసిన తరువాత టీఆరెస్ నేతలంతా మూకుమ్మడిగా ఆయనపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కోదండరాం ను కోదండరాంరెడ్డి ఓ విషపు నాగు అంటూ బాల్క సుమన్ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన సాధారణ విద్యార్థి అయిన బాల్క సుమన్ ఒక్కసారిగా ఎంపీ అయిన తరువాత ఇలా ఉద్యమ గురువును దారుణంగా అవమానించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోదండ రాం అనుభవమంత వయసులేని బాల్క సుమన్ ఆయన్ను అంత మాటలనే సాహసం చేశారంటే దాని వెనుక పార్టీ పెద్దల ఆదేశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇక కోదండరాం విషయానికొస్తే ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే అయినప్పటికీ చాలాకాలం కిందటే ఆయన అలాంటి గుర్తింపు నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. గతంలో దళితులపై జరిగిన ఊచకోతలకు నిరసనగా తన పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్న కోదండరాం వంటి వ్యక్తిని ఇలా కులం పేరుతో విమర్శించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ లోని రెడ్డి వర్గ నేతలతో కలిసి కోదండరాం ముఠా కడుతున్నారన్న ముద్ర వేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఇదంతా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు