ముప్పతిప్పలు పెడుతున్న ముద్రగడ

ముప్పతిప్పలు పెడుతున్న ముద్రగడ

కాపు గర్జన కేసుల్లో అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని, కావాలంటే తనను అరెస్టు చేసుకోవాలని సవాల్ విసురుతూ అమలాపురం పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తనను అదుపులోకి తీసుకున్న పోలీసులకు ముద్రగడ చుక్కలు చూపిస్తున్నారు. అమలాపురంలో అరెస్టు చేసిన ముద్రగడను తొలుత రాజమండ్రిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లాలనుకున్నా ఆ తరువాత ఆయన్ను కిర్లంపూడిలోని తన సొంతింటిలో దించాలని పోలీసులు ప్రయత్నించారు.

అదుపులోకి తీసుకున్న తరువాత ముద్రగడను వ్యాను ఎక్కించి అమలాపురంలోనే ఊరంతా తిప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా కిర్లంపూడి రూటు పట్టారు పోలీసులు. నేరుగా కిర్లంపూడిలోని ఆయన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ దించాలని ప్రయత్నించారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు సహా భారీ పోలీసులు బలగాలు ఆయన వెంట వెళ్లాయి.  అయితే... కిర్లంపూడి చేరుకున్నాక ముద్రగడ అడ్డంతిరిగారు. తనతో వచ్చిన డీఎస్పీ స్థాయి అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసు వ్యాన్ ను తాను దిగబోనని భీష్మించారు. దీంతో పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.

పోలీసు వ్యానులోనే కూర్చుని కిందకు దిగకుండా మొండికేస్తున్న ముద్రగడను ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. అరెస్టు  చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని లేకుంటే తనను జైలుకు తరలించాలని ఆయన డిమాండ్ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులు ఉన్నారు. తనను బలవంతంగా వ్యాన్ ను దించితే, మరోసారి స్టేషన్ ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. కేసులో నిందితులుగా ఉన్నవారి జాబితాను తనకిస్తే, తానే స్వయంగా వారిని స్టేషనులో అప్పగిస్తానని, అమాయకులను భయాందోళనలకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని ముద్రగడ డీఎస్పీలతో వాదనలకు దిగారు.

తనను కిందకు దించితే మళ్లీ పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తానని ముద్రగడ హెచ్చరించడంతో పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. సున్నితమైన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతోందో అన్న ఆందోళనలో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ముద్రగడలాంటి మొండోడిని రాజకీయాల్లో తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని సీనియర్ పోలీస్ అధికారులు కూడా అంటున్నారు. మొత్తానికి ఇది ఎటు టర్ను తీసుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు