కడప కోటలో బిగ్ ఫైట్ కు రెడీ..

కడప కోటలో బిగ్ ఫైట్ కు రెడీ..

ఏపీలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్ష నేత జగన్ ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చెప్పులు చూపించుకోవడం.. చీపుర్లతో కొడతామనడం వంటి దిగజారుడు రాజకీయాలు ముదిరిపోవడంతో రెండు పార్టీలు, ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త వాతావరణమే ఉంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో నవ్యాంధ్రలో చంద్రబాబు రెండేళ్ల పాలన పూర్తికానున్న తరుణంలో విపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో తలపెట్టిన  మహాసంకల్ప సభ ఇంకెంత ఉద్రిక్తతలకు దారితీస్తుందో అన్న చర్చ జనంలో జరుగుతోంది. టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న జగన్ ఇలాకా అయిన కడపలో ఈ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ సభతో తమ సత్తా చాటాలనే కసి తెదేపా నాయకుల్లో కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తోపాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఈ పాటికే ఏర్పాట్ల రంగం లోకి దిగారు. కడప స్టేడియంలో జరగనున్న ఈ సభకు లక్షమందిని తరలించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టే విధంగా ఆయనకు చెంపపెట్టుగా ఉండేవిధంగా ఈ సభ ఉండాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ సొంత జిల్లా కడపలో పూర్తిగా తెలుగుదేశం జెండా ఎగరాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తరచూ కడపలో పర్యటిస్తున్నారు.  గత నెలలో మూడు సార్లు చంద్రబాబు కడపలో పర్యటించారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న మహా సంకల్ప యాత్రను మొదట ఒంగోలులో నిర్వహించాలని అనుకున్నా... ఆ తరువాత కడపలో నిర్వహించేలా ప్లాను మార్చారు.  కడప జిల్లాలో... మరీ ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ  పట్టు సాధించి జగన్‌ను ఓడించేందుకు ఇప్పటినుంచే చంద్రబాబు ప్లాట్ ఫాం వేస్తున్నట్లుగానూ తెలుస్తోంది.  పులివెందుల నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలు అమలు పరిచి నియోజకవర్గంలో తెలుగుదేశం పతాకాన్ని రెపరెపలాడించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు కార్యక్రమాలను పులివెందుల నియోజకవర్గంలో చేపట్టారు. మరోవైపు కడప జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్‌ నేతలు మహా సంకల్ప సభలో సీఎం సమక్షంలో తెదేపాలో చేరుతారని తెలుస్తోంది.  మాజీ రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి అహ్మదుల్లా పేర్లు వినవస్తున్నాయి.  ఎలాగైనా జగన్ సొంత జిల్లాను టీడీపీ పరం చేయాలని చంద్రబాబు సంకల్పం పూనినట్లు తెలుస్తోంది.  కాగా మహాసంకల్ప సభను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా ప్రయత్నాలు చేస్తుండడంతో బిగ్ ఫైట్ తప్పదని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు