ఏపీకి స‌హాయంపై నిర్మ‌ల‌మ్మ సీరియ‌స్‌

ఏపీకి స‌హాయంపై నిర్మ‌ల‌మ్మ సీరియ‌స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించి కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారంటూ విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఏపీ అభివృద్ధికి తాను ఏం చేశానో ప్ర‌త్యేకంగా ట్విట్ట‌ర్‌లో వివరించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంపిల్యాడ్) పథకం నిధులలో మీకు రాజ్యసభ ప్రాతనిథ్యాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని ఖర్చు పెట్టారు? అన్న ప్రశ్నకు ఆమె ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు. ఎంపిల్యాడ్ పథకం క్రింద తనకు కేటాయించిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ అభివృద్ధి పథకాలకే వినియోగించానని తెలిపారు.

భీమవరం, విశాఖలను ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా ప్రకటించానన్నారు. ఎగుమతులకు సంబంధించిన మౌళిక వసతుల ఏర్పాటుకు కృషి చేశానని ట్వీట్ చేశారు. తాత్కాలికంగా విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు అమరావతిలో స్థలాన్ని గుర్తించామని, ఐఐఎఫ్‌టి కోసం భూమిని కూడా గుర్తించామని తెలిపారు. దీనికి త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు. అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటైందని, భారీ పెట్టుబడులకు, ఉపాధికి దోహదపడేలా ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహకారంతో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను తీసుకొచ్చానన్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌ను తీసుకెళ్లామని, దీనివల్ల రాయలసీమలోని నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఇంతేకాకుండా పొగాకు రైతుల గురించి కూడా శ్రద్ధ వహించానని, పొగాకు ధరలు పతనమవుతున్న క్రమంలో, కొనుగోళ్లు పడిపోయిన నేపథ్యంలో వారికి బాసటగా నిలిచానని సీతారామ‌న్‌ గుర్తుచేశారు. తూర్పుతల్లు, పెదమాయినవానిలంక గ్రామాలను సౌరశక్తి ఆధారంగా విద్యుత్‌ను పొందుతున్న తొలి గ్రామాలుగా మార్చానని చెప్పుకొచ్చారు. కేవలం ఇవన్నీ కూడా తమ పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తాను చేసినవని తెలిపారు. 'చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. చూస్తూనే ఉండండి, ప్రశ్నించండి' అని కూడా ఆమె ట్వీట్ చేశారు. నిర్మలా సీతారామన్ తీరుపై అసంతృప్తి మధ్య పెరిగిపోయిన నేప‌థ్యంలో ఈసారి రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో సీతారామన్ ఇప్పుడు కర్నాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండోసారి ఆమెకు అవకాశం ఇవ్వరాదంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన వ్యతిరేకత మధ్య పైవిధంగా సీతారామన్ వివరణ ఇచ్చుకున్నారని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు