ఓయూ పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన రేవంత్

ఓయూ పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన రేవంత్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వ‌హించిన స‌భలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఓయూలో ఒకవైపు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. మరోవైపు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉద్రికత్త వాతావరణం క‌నిపించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి వేర్వేరుగా జెండాలు ఎగురవేశారు. ఓయూలో స‌భ నిర్వ‌హించ‌వ‌ద్ద‌నే ఆదేశాలు, క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో ఈ స‌మావేశానికి హాజ‌రై పోలీసుల‌కు స‌వాల్ విసిరారు.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 'జనజాతర' సభ కార్యక్రమంలో టీడీపీ నేత‌ రేవంత్‌రెడ్డి పాల్గొంటే సభను అడ్డుకుంటామని కొంత మంది విద్యార్థులు హెచ్చరించారు. మరోవైపు సభ జరిపితీరుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకొని ఓయూలో సభలు నిర్వహించకూడదని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని వెల్లడించింది. దీంతో ఓయూ మరోసారి వేడెక్కింది. 'జనజాతర' సందర్భంగా ఓయూలోని అన్ని ప్రధాన రహదారులు, ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన రహదారులు మూసేసి, స్థానికుల్ని, విద్యార్థుల్ని, బోధనేతర సిబ్బంది, ఆచార్యుల్ని ఐడీ కార్డులు ఉంటేనే లోనికి అనుమతించారు. మీడియా వాహనాలను అనుమతించలేదు. విద్యార్థులు హద్దులు దాటితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ నేతలు అనుమతి లేనిదే ఓయూలోకి రావొద్దన్న రిజిస్ట్రార్‌ వ్యాఖ్యలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఓయూలో జ‌రిగే సభకు టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఓయూ విద్యార్థి రాహుల్‌, ఇతరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా స్పెషల్‌ లంచ్‌మోషన్‌ కింద విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్పష్టం చేశారు. ఓయూలో రాజకీయ నేతలు, పార్టీలకు సంబంధించి ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఓయూ వీసీ, పోలీసులదేనని స్పష్టం చేశారు. ఒక పక్క కోర్టు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి రాకను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఆదేశాలు ఉన్నప్ప‌టికీ రేవంత్‌రెడ్డి ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యారు.

టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆ ముందు రోజే ఓయూలో రహస్యంగా బస చేసి సభకు హాజరై ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కాగా ఈ స‌భ‌కు హాజ‌రైన కాంగ్రెస్‌ నేతలు మల్లు భట్టివిక్కమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా హాజరుకాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో రేవంత్ పోలీసుల‌కు త‌న‌దైన మార్క్ రాజ‌కీయం చూపార‌నే చ‌ర్చ ఓయూలో జ‌రిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English