ఆ వైకాపా ఎమ్మెల్యే జంపింగ్ కొత్త‌గా ఉందే..

ఆ వైకాపా ఎమ్మెల్యే జంపింగ్ కొత్త‌గా ఉందే..

ఏపీలో వైకాపా ఎమ్మెల్యేల జంపింగ్‌లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బుధ‌వారం ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైకాపా అధ్య‌క్షుడు, ఆ పార్టీ గిద్ద‌లూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి జ‌గ‌న్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఇక ఈ రోజు అదే జిల్లాకు చెందిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా సైకిలెక్కేస్తున్నారు. పోతుల‌తో వైకాపాలో ప‌డిన వికెట్ల సంఖ్య 19కు చేరుకోనుంది. ఇక ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు అయితే మ‌రో 15 మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చేస్తున్నార‌ని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు.

 ఇదిలా ఉంటే ఈ రోజు పార్టీలో చేరుతున్న కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీ ఎంట్రీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎమ్మెల్యేల జంపింగ్ కంటే చాలా కొత్త‌గా జ‌రుగుతోంది. వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుండ‌డంతో అక్క‌డ పార్టీకి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న‌వారంద‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పాత‌-కొత్త నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు స‌యోధ్య లేదు.

 నంద్యాల‌లో భూమా నాగిరెడ్డి వ‌ర్సెస్ శిల్ప బ్రద‌ర్స్‌, క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి, ప‌శ్చిమ‌లో కొత్త‌ప‌ల్లి వ‌ర్సెస్ బండారు, అద్దంకిలో గొట్టిపాటి వ‌ర్సెస్ క‌ర‌ణం, క‌దిరిలో బాషా వ‌ర్సెస్ ఇలా చెప్పుకుంటూ పోతే వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను పాత వ‌ర్సెస్ కొత్త నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. కానీ పోతుల టీడీపీ ఎంట్రీ మాత్రం మిగిలిన ఎమ్మెల్యేల చేరిక కంటే చాలా కొత్త‌గా జ‌రిగింది.

  పోతుల రామారావు టీడీపీలో చేరే విషయంలో టీడీపీ నాయ‌కులు ఎక్క‌డా నిర‌స‌న గ‌ళాలు వినిపించ‌లేదు. గురువారం తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతున్న ఆయనకు చేరికకు ముందే అరుదైన స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు బుధ‌వారం పోతుల ఇంటికి వెళ్లి మ‌రీ స్వాగ‌తం ప‌లికారు. కందుకూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దివి శివ‌రాం కూడా బుధ‌వారం విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబుతో స‌మావేశ‌మై పోతుల‌తో క‌లిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. దీంతో వైకాపా నుంచి పోతుల టీడీపీ ఎంట్రీ ప్ర‌త్యేకంగా నిల‌వ‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు