ఇలా కెలకటం అవసరమా భూమన?

ఇలా కెలకటం అవసరమా భూమన?

నేతల మాటలు ఎంతలో ఎంతలా మారిపోతాయి అన్న దానికి నిదర్శనంగా చెప్పొచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. జగన్ కు సన్నిహితుడైన భూమన కరుణాకరణ్ రెడ్డి మాటల్ని చూస్తే. రెండు రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలకు.. తాజాగా చెబుతున్న మాటలకు అస్సలు పొంతనే కుదరటం లేదు. రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తనకు బలం లేకున్నా నాలుగో స్థానానికి పోటీ చేయాలని ఏపీ అధికారపక్షం భావించటం.. అందుకు తగ్గట్లు కాస్త గ్రౌండ్ వర్క్ షురూ చేయగానే.. ఏపీ విపక్షం ఎంతలా ఉక్కిరిబిక్కిరి అయ్యిందో తెలిసిందే.

ఒకరు తర్వాత ఒకరుగా బయటకు వచ్చి.. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని.. బలం లేకున్నా ఎలా పోటీ చేస్తారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించిన పరిస్థితి.

కారణాలు ఏమైనా.. నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపకూడదంటూ బాబు డిసైడ్ అయిన నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల టోన్ ఒక్కసారి మారిపోయింది. బలం లేకున్నా అప్రజాస్వామికంగా నాలుగో అభ్యర్థి చేత రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. కానీ ఆఖరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు భయపడి అలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. నిజానికి.. చంద్రబాబు కానీ రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద కష్టమే కాదు.

జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. పార్టీని చీల్చి మరీ తాను అనుకున్నది చేయగలిగిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నది మర్చిపోకూడదు. కానీ.. సన్నిహితులు.. మిత్రులు ఇచ్చిన సూచన మేరకు నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఇష్టపడని చంద్రబాబు వైఖరిని పుల్ల పెట్టి కెలికినట్లుగా.. ఈగో హర్ట్ చేసేలా.. రెచ్చగొట్టేలా భూమా లాంటి నాయకులు మాట్లాడితే నష్టం జగన్ పార్టీకేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.  కొన్ని విషయాల్ని ప్రస్తావించి.. ప్రస్తావించకుండా వదిలేయటానికి మించింది మరొకటి ఉండదన్న విషయాన్ని జగన్ పార్టీ నేతలు గుర్తిస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు