కాంగ్రెస్ కు.. బీజేపీకి తేడా లేదంటున్న అసద్

కాంగ్రెస్ కు.. బీజేపీకి తేడా లేదంటున్న అసద్

తాను అనుకున్నది జరగకపోతే చాలు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి తెగ చిరాకు వచ్చేస్తుంది. ఒక్కసారి కానీ ఆయనకు ఒళ్లు మండితే ట్విట్టర్ లో ఏడాపెడా ట్వీట్ చేయటంతోపాటు.. సభల్ని నిర్వహించి తన రాజకీయ ప్రత్యర్థులను దునుమాడేస్తారు. తాజాగా అలాంటి పనే షురూ చేశారు. కాకుంటే ఈసారి ఆయన టార్గెట్ చేసింది తనకు ఆగర్భ శత్రువైన బీజేపీ మీద కాదు.. ఒకప్పుడు తాను చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన కాంగ్రెస్ పైన.

కాంగ్రెస్ తో మంచి సంబంధాలు మొయింటైన్ చేయటమే కాదు.. ఆ పార్టీకి మిత్రుడిగా వ్యవహరించిన అసద్ కు.. కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ తో తేడా వచ్చిందని చెప్పాలి. ఆప్పటి నుంచి మజ్లిస్.. కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోన్న పరిస్థితి. తాజాగా ఆయన కర్ణాటకలో ఒక సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆయన బహిరంగ సభ నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందన్న సందేహంతో కర్ణాటక ప్రభుత్వం ఆయన సభకు అనుమతి నిరాకరించింది.

దీంతో అసద్ కు ఒళ్లు మండిపోయింది. తాను సభ పెట్టుకుంటానంటే వద్దంటూ కర్ణాటక ప్రభుత్వం నోటీసులు ఇవ్వటాన్ని తప్పు పట్టిన ఆయన.. ఇదేనా సమానత్వం అంటే.. ఇక మీకూ బీజేపీకి తేడా ఏముంది? అంటూ తన ట్వీట్ తో సిద్ధరామయ్య సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

గడిచిన నెల రోజుల్లో మహారాష్ట్రలో ఐదు సమావేశాలు నిర్వహించానని.. తమిళనాడులో మూడు ఎన్నికల సభల్లో పాల్గొన్నానని.. అయితే కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మాత్రం సిగ్గుపడేలా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో సభలు పెట్టుకుంటూ కూడా బీజేపీ మీద మండిపడటం ఏమిటో అసద్ కే తెలియాలి. అంటే.. సభలకు అనుమతి ఇచ్చిన బీజేపీ సర్కారుకు.. సభకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ సర్కారుకు అసద్ దృష్టిలో పెద్ద తేడా ఏమీ లేదా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు