జేసీ లో ఈ యాంగిల్ అదిరిపోయింది

జేసీ లో ఈ యాంగిల్ అదిరిపోయింది

తెలుగు ప్రజలకు జేసీ బద్రర్స్ సుపరిచితులే. కాకపోతే.. ఇప్పుడు మేం చెబుతున్నది ప్రముఖ వస్త్ర సంస్థ జేసీ బద్రర్స్ గురించి కాదు. రాజకీయాల్లో తలపండిన జేసీ బద్రర్స్ గురించి అనంతపురం జిల్లాకు చెందిన ఈ సోదరుల్లో ఒకరు ఎంపీగా వ్యవహరిస్తుంటే.. మరొకరు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. పలు వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి తరచూ మీడియాలోవార్తలు వస్తుంటాయి. మోనార్క్ లా వ్యవహరిస్తారంటూ ఆయన మీద ఆరోపణలు వస్తుంటాయి. అలాంటి ఆయనకు సంబంధించిన ఆసక్తికర యాంగిల్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు.. పచ్చదనాన్ని పెంచాలంటూ మాటలు చెప్పటం.. హితబోధ చేయటం లాంటి వాటికి జనాల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. దుడ్డుకర్ర పట్టుకొన్న తన ఫోటోను భారీ ఫ్లెక్సీలుగా మార్చి.. తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్లు అమ్మకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ రూల్ ను పాటించని వ్యాపారులపై దాడులు చేయించి భారీగా జరిమానా (10వేల రూపాయిల నుంచి రూ.50వేల వరకు) విధించారు. అంతే.. దెబ్బకు వ్యాపారులు లైన్లోకి వచ్చేశారు. ఇప్పుడు తాడిపత్రి టౌన్లో ప్లాస్టిక్ కవరు కనిపించని పరిస్థితి. ఇక్కడితో ఆగిపోని జేసీ ప్రభాకర్ మరో అడుగు ముందుకేసి.. ప్రతి దుకాణం ముందు చెట్టు పెట్టాలన్న రూల్ ను మున్సిపల్ అధికారులతో పెట్టించారు.

అధికారులు చెప్పారు కదా అని మొక్కను పెట్టి దాన్ని పట్టించుకోని వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేయటమే కాదు.. ఆ దుకాణాల్ని బంద్ చేసేశారు. అలా కొన్ని దుకాణాల్ని బంద్ చేయించారు. వారు మళ్లీ చెట్టును తీసుకొచ్చి.. దాన్ని సుబ్బరంగా పెంచితే తప్పించి దుకాణం తెరుచుకోవటానికి అనుమతి ఇవ్వకుండా ఉండేలా చేశారు. ఇప్పుడు ఇళ్ల ఎదుట కూడా మొక్కల్ని పెంచాలని రూల్ పెట్టారు. ఆ మాటను వినని వారి ఇంటికి నీళ్ల కుళాయి కనెక్షన్ ను బంద్ చేయటం గమనార్హం. జేసీ మార్క్ రూల్స్ తో తాడిపత్రి టౌన్ ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ కావటమే కాదు.. చెట్ల పెంపకాన్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితికి వచ్చారు. ఏమాటకు ఆ మాటే.. ఈ విషయాల్లో మిగిలిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు జేసీ ప్రభాకర్ మాదిరి వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవటానికే ఎంతో బాగుంది కదూ..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు