క్లారిటీ ఇవ్వండి బాబు

క్లారిటీ ఇవ్వండి బాబు

ఒక సున్నితమైన అంశం గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇక.. అదే అంశం మీద పార్టీ పరంగా మాట్లాడాల్సి వస్తే అందరిదీ ఒకే మాట అయి ఉండాలే కానీ.. అధినేత ఒకరకంగా.. మిగిలిన వాళ్లు మరోలా మాట్లాడటం సబబుగా అనిపించదు. ఏపీ అధికారపక్షం తీరు ఇప్పుడు అలా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తుని ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు ఒకలా మాట్లాడుతుంటే.. మంత్రి గంటా వాదన మరోలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

తుని ఘటనలో రైలు విధ్వంసానికి బాధ్యుడు విపక్ష నేత వైఎస్ జగన్ అంటూ చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ లు దాదాపుగా తేల్చేసినట్లే. మహానాడు ఆఖరి రోజున మాట్లాడిన సందర్భంగా తండ్రికొడుకులు ఇద్దరు తుని ఇష్యూలో బాధ్యత జగన్ దేనన్న మాటను చెప్పేయటం కనిపించింది. వారి నోటి నుంచి ఈ మాట రావటానికి కొద్ది గంటల ముందు.. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోరకమైన వాదనను మీడియా ముందు వినిపించారు. కాపు ఉద్యమం మీద బలగాన్ని కూడగట్టుకునే పని చేస్తున్న ముద్రగడను టార్గెట్ చేసిన ఆయన.. తుని రైలు విధ్వంసానికి ముద్రగడ బాధ్యత వహిస్తారా? లేదంటే.. బాధ్యులు ఎవరో చెబుతారా? అని ప్రశ్నించటం గమనార్హం.

ఓపక్క విపక్ష అధినేత బాధ్యుడని పార్టీ అధినేత.. రాష్ట్రాధినేత అయిన చంద్రబాబు నోటి నుంచి వస్తే.. ఆయన పరివారంలోని మంత్రి గంటా నోటి నుంచి మాత్రం ముద్రగడదే బాధ్యత అన్నట్లుగా చెప్పుకురావటం గమనార్హం. ఇంతకీ.. తుని ఘటనలో బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు అయోమయంగా మారింది. ఇలాంటి విషయాల్లో పార్టీ అధినేత నుంచి నేతల వరకూ అందరి నోట ఒకే మాట వినిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు