హరీశ్ డీల్: భారీ సభతో కారెక్కనున్న కోమటిరెడ్డి బ్రదర్స్

హరీశ్ డీల్: భారీ సభతో కారెక్కనున్న కోమటిరెడ్డి బ్రదర్స్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మరో షాక్ తగలనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న నల్గొండ జిల్లాలోను ఆ పార్టీని బలహీన పరచాలని టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు కారెక్కేందుకు ముహూర్తం ఖరారయ్యింది. జూన్ ఆరవ తేదిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరిని పార్టీలో చేర్పించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మద్యవర్తిత్వం వహిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, 10 మంది జడ్పిటిసి సభ్యులు, 8 మంది ఎంపిపిలు,భువనగిరి పార్లమెంట్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరనున్నారని గులాబీ వర్గాల సమాచారం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీ భవన్ మెట్లెక్కడం మానేశారు. అదే సందర్బంలో పార్టీ నేతల వ్యవహర శైలిపైన ఆయన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన రాజగోపాల్‌రెడ్డిని ఒంటిచేత్తో వెంకట్‌రెడ్డి గెలిపించారు. పీసీసీ చీఫ్ లేదా సీఎల్పి పదవిని తనకు అప్పగించాలని ఆయన అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు ఓ బృందాన్ని ఢిల్లీకి పంపించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రి హరీశ్‌రావుతో సన్నిహతంగా ఉంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో పార్టీ పగ్గాలు పెడితే మునిగిపోవడం ఖాయమంటూ వారు హెచ్చరించారని తెలుస్తోంది.

కోమటిరెడ్డి సోదరుల పార్టీ మార్పుపై గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నప్పటకి జూన్ ఆరవ తేది మాత్రం పక్కా ముహూర్తమని సమాచారం. మంత్రి హరీశ్‌రావుతో ప్రాథమిక చర్చలు ముగించుకున్న వీరు సీఎం కేసీఆర్‌తోను ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పీపీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎల్పి నేత జానారెడ్డిలు ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో వారు కోమటిరెడ్డి ఎదుగుదలను అడ్డుకుంటు న్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వీరికి ఎంపీలు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జత కలిశారని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో బాగంగానే కోమటిరెడ్డి సోదరులు పార్టీలో చేరేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని గులాబీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో కేసీఆర్ బిజీగా ఉన్నారని జూన్ ఆరున కోమటిరెడ్డి సోదరులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గులాబీ తీర్థం పుచ్చుకుంటారని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం అందినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు