ప్ర‌త్యేక‌హోదాపై హ‌రికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌త్యేక‌హోదాపై హ‌రికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక‌హోదా కోసం ఇంటికొక‌రు చొప్పున బ‌య‌టకు వ‌చ్చి స‌మ‌రం చేయాల‌ని పిలుపునిచ్చారు. తిరుప‌తిలో అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న మ‌హానాడుకు గైర్హాజ‌రైన ఆయన.. త‌న తండ్రి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని, తీసుకువస్తామ‌ని చెప్పిన వాళ్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత నందమూరి హరికృష్ణ పైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని ఆయన మండిప‌డ్డారు. ప్రత్యేక హోదాపై ప్రతి ఒక్కరు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నందమూరి వంశ వీరాభిమానులు, తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఆనాడు ఇస్తామని మోసం చేశారు, తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, అందరం కలిసి పోరాడి హోదా తెస్తేనే మనం సిసలైన తెలుగు బిడ్డలం అవుతామని ఆయన అన్నారు.

ప్రతి ఇంటి నుంచి ఒకరు అయినా బయటకు వచ్చి సమరం చేయాలని హరికృష్ణ పిలుపు ఇచ్చారు. తెలుగువాడన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం శపథం చేయాలని హరికృష్ణ అన్నారు.అప్పుడే ఎన్టీఆర్ ఆశయం నెరవేరుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించడమే గొప్ప కార్యక్రమమని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగు జాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని.. తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానుభావుడని కొనియడారు. మహానాడుకు హరికృష్ణ వెళ్లకపోవడమే కాకుండా, ప్ర‌త్యేక హోదాపై వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తుంటే ఈ వ్యాఖ్య‌లు అటు చంద్ర‌బాబు, ఇటు బీజేపీని ఇర‌కాటంలో పెట్టేవిగా ఉన్నట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు హ‌రికృష్ణ వ్యాఖ్య‌లు ఈ రెండు పార్టీల్లోను హాట్ టాపిక్‌గా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు