తెలంగాణలో ఆ ‘విద్యా సంస్థల’ అధినేతల అరెస్ట్లు?

తెలంగాణలో ఆ ‘విద్యా సంస్థల’ అధినేతల అరెస్ట్లు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నారా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల్ని లైట్ తీసుకుంటున్న విద్యా సంస్థల మీద గుర్రుగా ఉన్న కేసీఆర్.. ఫీజు రీయింబర్స్ మెంట్ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అవకతవకలకు పాల్పడే వారి విషయంలో తనదైన శైలిలో రియాక్ట్ కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి.. ప్రైవేటు కాలేజీలకు మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటం.. తెలంగాణ సర్కారు తీరును తప్పు పట్టిన విద్యాసంస్థల యాజమాన్యాల కారణంగా ఎంసెట్ పరీక్షల్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకోవటం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను తమ ఆదాయవనరులుగా మార్చుకున్న తీరుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ నిర్ణయాల్ని సవాలు చేస్తున్న విద్యాసంస్థల్లోని కొందరికి గుణపాఠం చెప్పేందుకు వీలుగా.. వారి అవకతవకలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లుగా కార్యాచరణను సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోఇష్టారాజ్యంగా వ్యవహరించి.. కోట్లాది రూపాయిలు కొట్టేసిన కొన్ని విద్యా సంస్థల్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు.. వారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ప్రభుత్వానికి సవాలు విసిరే స్థాయిలో వ్యవహరిస్తున్న కళాశాల్ని దారికి తెచ్చుకోవటానికి వీలుగా వారు చేసే తప్పుల మీద ఫోకస్ చేసి.. చట్టప్రకారం వారిని దారికి తెచ్చుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ అధికారపక్షం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వ నిధులు మింగేసిన కాలేజీ అధినేతలకు షాకులు ఇచ్చేలా అరెస్ట్ లు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. అదో సంచలనంగా మారుతుందని చెప్పాలి. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయటంతో పాటు.. తప్పు చేసిన వారిపై కొరడా ఝుళిపించటంలో కేసీఆర్ మొనగాడన్న పేరు తెచ్చుకోవటం ఖాయమనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు