ఆ రాష్ట్ర సీఎం అభ్యర్థి న్యూస్ ఛానల్ ఎడిటర్..?

ఆ రాష్ట్ర సీఎం అభ్యర్థి న్యూస్ ఛానల్ ఎడిటర్..?

దేశంలో జర్నలిస్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ కొందరికుండే ఫేం అంతా ఇంతా కాదు. వారికో ఇమేజ్ ఉండటమే కాదు.. వారి మాటలు తీవ్రప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఆ తరహా జర్నలిస్టులలో ఒకరు రాజ్ దీప్ సర్దేశాయ్. న్యూస్ ఛానల్ ఎడిటర్ గా విశేష పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన్ను కలవటానికి.. ఆయన సలహాలు తీసుకోవటానికి రాజకీయ పార్టీ అధినేతలు తహతహలాడుతుంటారు. ఇప్పటి సంగతిని పక్కన పెడితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో రాజ్ దీప్ తో భేటీ కావాలని పలుమార్లు ప్రయత్నించారు. అయితే.. కేసీఆర్ తో భేటీకి సర్దేశాయ్ ఆసక్తి ప్రదర్శించలేదు.

అయితే.. అనంతర కాలంలో పరిస్థితులు మారిపోవటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసే క్రమంలో కేసీఆర్ బలోపేతం కావటం.. ఆయనతో భేటీకి పలువురు మీడియా ప్రముఖులు ప్రయత్నించే వారు. కానీ.. ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలిసిన కేసీఆర్.. తాను తిరుగులేని శక్తిగా అవతరించే సమయంలో తనను కలిసేందుకు ఆసక్తి చూపించని వారికి తనదైన రీతిలో షాకులిచ్చారు. అలా షాక్ తిన్న వారిలో సర్దేశాయ్ కూడా ఒకరు. ఒకప్పుడు తనతో భేటీ కావాలని కేసీఆర్ కోరితే తాను భేటీ కాలేదని.. ఈసారి అవకాశం లభిస్తే ఆ అవకాశాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనంటూ ఒక కాలమ్ లో సర్దేశాయ్ రాసుకున్నారు.

ఇక్కడ ఎవరు ఎవరిని ఎలా షాకులిచ్చుకున్నారన్నది పాయింట్ కానే కాదు. రాజ్ దీప్ సర్దేశాయ్ స్థాయి చెప్పటమే ఉద్దేశం. అలాంటి ఆయన్ను ఇప్పుడు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజ్ దీప్ తో మంతనాలు మొదలెట్టినట్లుగా తెలుస్తోంది. డిల్లీ పొలిటికల్ సర్కిల్స్ తో విపరీతమైన చర్చ జరుగుతున్న ఈ అంశంపై రాజ్ దీప్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేజ్రీవాల్ ఆలోచనకు ఓకే చెప్పి.. గోవా బరిలోకి దిగితే.. అదో సంచలనంగా మారటం ఖాయమనే చెప్పాలి. మరి.. దీనికి రాజ్ దీప్ సర్దేశాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు