చంద్రబాబును లెక్కలడిగిన చిన్నమ్మ

చంద్రబాబును లెక్కలడిగిన చిన్నమ్మ

చంద్రబాబు అంటేనే మండిపడే బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తాజాగా మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. నవ్యాంధ్రకు కేంద్రంలోని బీజేపీ అన్ని రకాలుగా సాయం చేస్తోందని చెప్పిన ఆమె కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు.  ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి రూపాయికీ లెక్క చెప్పి ఆపై విమర్శలు చేయాలని చంద్రబాబునాయుడికి ఆమె హితవు పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం కేంద్రం ఇచ్చిన డబ్బుపై ఇప్పటికీ చంద్రబాబు లెక్క చెప్పలేదని ఆమె మండిపడ్డారు.  ఆ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో లోటును పూడ్చడానికి కూడా కేంద్రం నిధులిస్తోందని..  మోదీ సర్కారు చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలను, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించి చెబుతామని ఆమె స్పష్టం చేశారు.

బీజేపీ విజయ్ పర్వ్ నేపథ్యంలో అమరావతిలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  ఏపీలోని టీడీపీ నేతలు, చంద్రబాబు నిజాలు కప్పిపెట్టి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే దిశగానే దృష్టి పెట్టామ‌ని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి అప్పుడే ఎటువంటి నిర్ణ‌యాన్ని తెలప‌లేమ‌ని ఆమె వ్యాఖ్యానించారు.  14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా సాధ్యం కావ‌డంలేద‌ని ఆమె అన్నారు. ఏపీకి బీజేపీ స‌మ‌కూర్చిన నిధులు, సంక్షేమ పథకాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని చెప్పారు.  చంద్రబాబు దుష్ప్రచారాన్ని ఎండగడతామని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా విజయ్ పర్వ్ నేపథ్యంలో చిన్నమ్మ దూకుడు పెంచిందా లేదంటే చంద్రబాబుపై సమరానికే సిద్ధమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏదైనా కూడా ఆమె చాలా కాలం తరువాత చంద్రబాబుపై ఈ రేంజిలో విరుచుకుపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ నేతలు మాత్రం ఇంతవరకు చిన్నమ్మ వ్యాఖ్యలపై స్పందించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు