వైసీపీకి కొత్త టెన్షన్

వైసీపీకి కొత్త టెన్షన్

పార్టీ ఎమ్మెల్యేల వలసలతో ఉక్కిరిబిక్కరవుతున్న వైసీపీకి ఇప్పుడు ఇంకో టెన్షన్ మొదలైంది. రాజ్యస‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల పార్టీలో వేడిని పుట్టిస్తోంది. అభ్యర్థి పేరు ఖ‌రారైన సీటు గెలుస్తామా లేదా అన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం, ఎన్నికల డెడ్‌లైన్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో లెక్కలు తారుమారు అవుతాయా, పెద్దల సభలో స్ధానం దక్కించుకుంటారా అనే సందేహం పార్టీ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ప్ర‌కారం ఖాళీ అయిన స్థానాలకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో నాలుగు రాజ్యస‌భ స్థానాలకు ఎన్నిక‌లు నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాస‌న‌స‌భ పూర్తి బ‌లం 175 కావ‌డంతో నాలుగు రాజ్యస‌భ సీట్లలో టీడీపీకి మూడు స్థానాలు ప్రతిపక్ష వైసీపీకి ఒక సీటు ద‌క్కే అవ‌కాశం వుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తుండటంతో రాజ్యస‌భ సీటు ద‌క్కుతుందా లేదా అన్న అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ టీడీపీ ఐదో అభ్యర్ధిని బరిలోకి దింపితే మాత్రం ఎన్నిక తప్పని సరి అవుతుంది. ఒక్కో పార్టీ అభ్యర్ధికి 36 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. వైసీపీకి ఇప్పటికి 50 మంది సభ్యుల  బ‌లం ఉండ‌టంతో రాజ్యస‌భ ఎన్నిక‌ల‌లో పోటీ అనివార్యమైనా తమకు కచ్చితంగా ఒక‌స్థానం దక్కుతుందని లెక్కలేస్తున్నారు.

అయితే ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. ఇప్పుడు మ‌రికొంత మంది పార్టీ మారతార‌న్న ప్రచారం వైసీపీ నేత‌ల్ని అందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇంకో 15మంది తెలుగుదేశంలో చేరితే మాత్రం పార్టీకి పెద్దల స‌భలో స్థానం లేనట్టే.  ప్రతిపక్షానికి  రాజ్యస‌భ సీటు ద‌క్కకుండా ఉండేందుకే ఎమ్మెల్యేల‌ను పక్కా ప్రణాళిక‌తో చేర్చుకుంటుంద‌న్న ప్రచారం న‌డుస్తోంది. మ‌రోవైపు టీడీపీలో రాజ్యస‌భ ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిల‌బెడితే ఇబ్బందిక‌ర పరిస్థితి ఎదుర‌వుతుంద‌ని వైసీపీ నేత‌లు మ‌దన‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు