డీఎస్ కు అంత కోపం ఎందుకు?

డీఎస్ కు అంత కోపం ఎందుకు?

మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ కు కోపమొచ్చింది. అది కూడా మామూలు కోపం కాదు. రాజకీయంగా ఎంతో సీనియర్ అయిన ఆయన.. తొందరపడి ఒకరిని ఒక మాట.. బహిరంగంగా అనరు. కామెంట్ చేయరు. వీలైనంతవరకు అలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. లోగుట్టుగా చేయాల్సిన కార్యక్రమాలను గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తుంటారు. వైఎస్ మీద మనసులో పీకల్లోతు కోపం ఉన్నా పైకి మాత్రం అలాంటి ఛాయలు కనిపించకుండా ఉండేవారు. పెట్టాల్సిన దగ్గర ఎర్త్ పెట్టేసి మిన్నకుండిపోవటం డీఎస్ కు ఉన్న లక్షణం. అలాంటి వ్యక్తి సైతం కోపంతో
శివాలు ఎత్తారు. బహిరంగంగా ముఖ్యమంత్రిపై తిట్ల వర్షం కురిపించారు. నీస్థాయి తెలుసుకో అంటూ వేలెత్తి ప్రశ్నించారు. డీఎస్ కు ఎందుకంత కోపం వచ్చింది? శాంతంగా ఉండే ఆయన శివాలెత్తేలా ఎందుకు వ్యవహరించారంటే విషయం వేరే ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన పక్షంలో..  అత్యంత భారీ ప్రయోజనం పొందే ప్రముఖుల జాబితాలో ఆయనొకరు. మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉండే డీఎస్..  పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించటం బాగా తెలుసు. అధిష్ఠానానికి అత్యంత విధేయుడిగా ఉండే ఆయన తెలంగాణ రాష్ట్రంలో కీలకభూమిక పోషించటం ఖాయం. ఇక.. కిరణ్ మీద అంత బాహాటంగా విరుచుకుపడటానికి కారణం.. సీన్లోకి అధిష్ఠానం రావటం. పార్టీ అధినాయకత్వాన్నే ఇరుకున పెట్టేలా సాగిన కిరణ్ ప్రెస్ మీట్... పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావటం ఖాయం కాబట్టి.. ఆ మంటలను తన వ్యాఖ్యలతో ఎగదోశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వ్యవహరించిన తీరును గుర్తు చేయటం ద్వారా.. సీఎం ఒంటెద్దు పోకడలు ఉన్న మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. జగన్ ప్రస్తావనతో అధిష్ఠానం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేయటంతో పాటు.. పార్టీ పట్ల విధేయతగా ఉండకపోతే. ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పకనే చెప్పుకొచ్చారు. తాజా ఆగ్రహంతో పార్టీకి వీర విధేయుడిగా కనిపించటంతో.. తెలంగాణవాదులను సంతృప్తి పర్చగలిగే కాంగ్రెస్ నేతగా ఆయన గుర్తింపు పొందం ఖాయం.

ఇలా.. ఒక్క విమర్శకు.. రెండు భారీ ప్రయోజనాలను పొందే వీలుంది. ఎంత బలంగా తిడితే అంత పెద్ద నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందే అవకాశం  ఉండటంతో.. డీఎస్ తన నోటికి ఎలాంటి రేషన్ పెట్టుకోకుండా.. కిరణ్ ను దులిపేశారని చెప్పొచ్చు. కళ్ల ముందు ఊరించే పదవులు ఉన్నప్పుడు.. ఎవరి స్పందనైనా అంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English