రాష్ట్రానికి అడుక్కుతినే సీఎం వ‌ద్ద‌ట

రాష్ట్రానికి అడుక్కుతినే సీఎం వ‌ద్ద‌ట

ఆంధ్రప్రదేశ్‌కు ప్ర‌త్యేక‌హోదా అంశం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రువు స‌మ‌స్య‌గా మారిపోతోంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని దాదాపుగా తేల్చిచెప్పేసిన నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు బాబు ల‌క్ష్యంగా చెల‌రేగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పీసీసీ అధ్యక్షులు ఎన్‌ రఘువీరారెడ్డి చంద్ర‌బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా చంద్ర‌బాబును అడుక్కు తినే ముఖ్యమంత్రి అని పోల్చారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరుపై ర‌ఘువీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు..కుక్కలు మొరిగినట్లు కరువుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రధాని వద్ద చంద్ర‌బాబు గొప్పలు చెప్పుకున్నారని ఆరోపించారు. ఇన్ని గొప్పలు చెప్పుకుంటే కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రధాని వద్ద ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయంతో కేసీఆర్‌ను నిలదీసేందుకు చంద్రబాబు భయపడుతున్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు పోరాడే ముఖ్యమంత్రి కావాలే త‌ప్ప అడుక్కుతినే సీఎం కాద‌ని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో మంత్రి ప‌ద‌వుల కోసం, బ‌హిరంగంగా దొరికిపోయిన‌ ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం, అవినీతి, భూదందాల నుంచి ర‌క్ష‌ణ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు నాయుడు ప‌ణంగా పెడుతున్నార‌ని ర‌ఘువీరా ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌చారం కోసం, ప‌ర్య‌ట‌న‌ల కోసం కోట్లు ఖ‌ర్చు చేయ‌డంలో చూపే శ్ర‌ద్ధ ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డంలో చూపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఒక‌వైపు నిధుల క‌ట‌క‌ట‌తో ఉన్నామ‌ని చెప్తూ స‌హాయం కోరుతూనే మ‌రోవైపు అధిక వృద్ధిరేటు చూపిస్తే కేంద్రం ఏ విధంగా స‌హాయం చేస్తుంద‌ని ర‌ఘువీరా నిల‌దీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English