రజినీని కెలికాడు.. అడ్రస్ గల్లంతవుతోంది

రజినీని కెలికాడు.. అడ్రస్ గల్లంతవుతోంది

యూట్యూబ్‌లోకి వెళ్లి విజయ్ కాంత్ అన్న పేరు కొట్టగానే.. వరుసబెట్టి ‘ఫన్నీ వీడియోస్’ తన్నుకుంటూ వచ్చేస్తాయి. వాటిలో ప్రధానంగా ఓ యోగా కార్యక్రమంలో విజయ్ కాంత్ విన్యాసాలతో కూడిన వీడియోలు బాగా హైలైట్ అవుతాయి. ఫుల్లుగా మందు కొట్టి వచ్చి విజయ్ కాంత్ చేసిన విన్యాసాలు చూస్తే నవ్వు ఆగడం కష్టం. ఇంకా పబ్లిక్ మీటింగుల్లో విజయ్ కాంత్ చేసిన వెర్రి వ్యాఖ్యానాలతో కూడిన వీడియోలు.. మీడియా వాళ్లను తిడుతున్న వీడియోలు.. ఇలాంటి ‘మోస్ట్ వ్యూడ్’ వీడియోస్ చాలానే కనిపిస్తాయి. గత ఎన్నికల్లో 28 సీట్లు సంపాదించిన పార్టీ అధినేత తీరిది. గత మూణ్నాలుగేళ్లలో ఎంత భ్రష్టుపట్టాలో అంతా పట్టాడు విజయ్ కాంత్. రాజకీయాల్లో ఓ కామెడీ పీస్ అయిపోయిన విజయ్ కాంత్‌కు తమిళ ఓటర్లు ఎలాంటి సన్మానం చేస్తున్నారో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

ఈసారి ముఖ్యమంత్రి నేనే.. తమిళనాట నేనే హీరో.. కరుణానిధి, జయలలిత విలన్లు అంటూ బీరాలు పలికిన డీఎండీకే అధినేత తన పార్టీని అధికారంలోకి తేవడం సంగతి తర్వాత.. స్వయంగా తనే ఓటమి పాలయ్యేలా కనిపిస్తున్నాడు. ఉళుందుర్ పేట్ట నియోజకవర్గంలో ప్రస్తుతం విజయ్ కాంత్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. అక్కడ అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉండగా.. రెండో స్థానంలో డీఎంకే ఉంది. విజయ్ కాంత్ ఏదో అద్భుతాలు చేస్తాడని ఎవరూ అనుకోలేదు కానీ.. కనీసం 2006 ఎన్నికల్లో మాదిరి తాను ఒక్కడైనా గెలుస్తాడని అంచనా వేశారు. కానీ ఆ ఆశ కూడా తీరేట్లు లేదు. తన మీద జనాల్లో ఉన్న నెగెటివ్ ముద్ర చాలదని.. ఎన్నికలు దగ్గరపడుతుండగా సూపర్ స్టార్ రజినీకాంత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడమే విజయ్ కాంత్ ఓటమికి కారణమని భావిస్తున్నారు. నేను రజినీకాంత్ లాగా భయపడి పారిపోను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సూపర్ స్టార్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వాళ్లందరూ విజయ్ కాంత్‌కు యాంటీగా మారి ఆయన ఓటమి కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. వాళ్ల వల్లే ఓడారని అనడానికేమీ లేదు కానీ.. ఆయన ఓటమిలో వాళ్ల పాత్ర కీలకం అని మాత్రం చెప్పొచ్చు. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో రజినీ అభిమానులు డీఎండీకేకు వ్యతిరేకంగానే పని చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు