కేటీఆర్‌పై హ‌రీష్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేటీఆర్‌పై హ‌రీష్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతి స్థానం ఎవ‌రిది?  మేన‌ల్లుడు హ‌రీష్‌రావుకు ప్రాధాన్యం త‌గ్గించి కొడుకును హైలైట్ చేయ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారా? ఇక హ‌రీష్‌ వ‌ర్గానికి చెక్ పెడ‌తారా?  నెమ్మ‌దిగా కేటీఆర్‌ను లైమ్ లైట్‌లోకి తెచ్చి.. హ‌రీష్‌రావ్‌ను మాత్రం వెన‌కాలే ఉంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా?  కొంత కాలంనుంచీ.. ఈ ప్ర‌శ్న‌లు తెలంగాణ‌లో గ‌ట్టిగా వినిపించాయి. వీటిపై ఎవ‌రూ నేరుగా స్పందించ‌లేదు. త‌ర్వాత హ‌రీష్‌రావ్, కేటీఆర్ క‌లిసి పాల్గొన్న సంద‌ర్భాలూ లేవు. ఒక‌రినొక‌రు పొగుడుకున్న సంద‌ర్భాలూ త‌క్కువే. కానీ తొలిసారిగా.. మంత్రి కేటీఆర్‌పై..హ‌రీష్‌రావ్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఆకాశానికి ఎత్తినంత ప‌నిచేశారు.

గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారంటే.. జీహెచ్ఎంసీ కోట‌పై గులాబీ జెండా రెపరెప‌లాడిందంటే.. అందుకు కార‌ణం  కేటీఆర్ అని చెప్ప‌వ‌చ్చు. హైద‌రాబాద్‌లోని గ‌ల్లీ గ‌ల్లీ తిరిగి ప్ర‌చారం నిర్వ‌హించారు. అలాగే ఐటీ ఉద్యోగుల‌తోనూ ప్ర‌త్యేకంగా స‌మావేశాలు ఏర్పాటుచేసి.. వారి మ‌నసు గెలుచుకున్నారు. మ‌రోప‌క్క హైద‌రాబాద్‌కు పారిశ్రామిక ప‌రంగా.. మ‌రిన్ని సంస్థ‌లు తీసుకొచ్చేలా కృషిచేస్తున్నారు. అందుకే అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు.ఇప్పుడు హ‌రీష్‌రావ్ కూడా ఈ జాబితాలో చేరారు.

కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్ అంటూ.. ప్ర‌శంస‌లు కురిపించారు. `ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. డైన‌మిక్ లీడ‌ర్‌. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దేశంలోనే నెంబ‌ర్ 1గా మార్చేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల‌తోపాటు.. ఇత‌ర రంగాల్లోనూ అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నారు.` అంటూ పొగిడేశారు. హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు కేటీఆర్ ఆహ్వానిస్తున్నార‌ని.. అందుకు ప్ర‌జ‌లు కూడా స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. మ‌రి హ‌రీష్ కేటీఆర్ విష‌యంలో ఒక్క‌సారిగా ఇలా ట‌ర్న్ తీసుకుని ఇలా పొగ‌డ‌డానికి కార‌ణాలేంటా అని అంద‌రూ ఆరా తీస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు