హరీశ్ రావు జాతీయ పార్టీ ముచ్చట విన్నారా?

హరీశ్ రావు జాతీయ పార్టీ ముచ్చట విన్నారా?

తెలంగాణ రాష్ట్ర సాధనతో టీఆర్ఎస్ ఇమేజ్ ఎంతగా మారిందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమకొచ్చిన పేరుప్రఖ్యాతుల్ని నిలుపుకుంటూ.. ప్రజల్లో రోజురోజుకీ తమ మీద ఆశలు పెంచుకునేలా చేయటంలో కేసీఆర్ సర్కారు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. కొన్ని అంశాల్లో కేసీఆర్ సర్కారును విమర్శించొచ్చు కానీ.. మొత్తంగా చూసినప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే పడతాయి. ఈ ముచ్చట ఇలా ఉంటే.. టీఆర్ఎస్ నేతల నోట్లో నుంచి ఎప్పుడూ లేని సరికొత్త మాటను చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు.

2019 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ జాతీయ పార్టీగా కీలకపాత్ర పోషిస్తుందని కొత్త ముచ్చటను చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధనతో ప్రజలకు తమపై ఒక అభిప్రాయం ఏర్పడిందని.. తాజాగా తమ పాలన తమ ఇమేజ్ ను మరింత పెంచుతోందన్న హరీశ్.. దేశంలో చోటుచేసుకుంటున్న పలు అంశాలపై నిర్దుష్ట అభిప్రాయాలు ఉన్నట్లుగా వెల్లడించారు.

జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్న హరీశ్ రావు.. బీజేపీ జాతీయ పార్టీ కానేకాదంటూ చిత్రమైన వ్యాఖ్యను చేశారు. కాంగ్రెస్ నేతల మీదున్న వ్యతిరేకత కారణంగానే బీజేపీని ఎన్నుకున్నారే తప్పించి బీజేపీ మీద ప్రజలకు ప్రేమలేదని చెప్పుకొచ్చారు. దేశంలో జాతీయ పార్టీ లేని కొరతను టీఆర్ఎస్ తీరుస్తుందని చెప్పిన హరీశ్.. ఎప్పటి మాదిరే తమకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంత్రి నొక్కి వక్కాణించారు. ఇన్ని డాబు మాటలు చెప్పిన హరీశ్.. తన చివరి మాటతో తమది ప్రాంతీయపార్టీ అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని చెప్పక తప్పదు. జాతీయ పార్టీగా మారాలన్న తహతహ ఉన్నప్పుడు ఒక ప్రాంతం మీద మోజు ఉండకూడదన్న కనీసం విషయం తెలీదా హరీశ్..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు