ఆ లేడీ డాన్ బెయిల్ కోసం 25 మంది లాయర్లు

ఆ లేడీ డాన్ బెయిల్ కోసం 25 మంది లాయర్లు

ఏపీలోని ఏర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారంలో పేరుమోసిన ఎంతోమంది స్మగ్లర్ల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఒక మహిళ ఉదంతం బయటకు రావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎయిర్ హోస్టెస్ గా.. మోడల్ గా పని చేసిన సంగీత చటర్జీ తర్వాతి కాలంలో ఎర్రచందనం స్మగ్లర్ అయిన లక్ష్మణ్ ను పెళ్లాడిన వైనం బయటకు రావటంతో పాటు.. భర్త పరోక్షంలో ఆమె నడిపిన ఎర్రచందనం స్మగ్లింగ్ దందా అందరిని విస్మయానికి గురి చేస్తోంది.  

ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే విషయంలో ఆమె నేర్పును పోలీసు వర్గాలు కథలుకథలుగా చెబుతున్నారు. ఆమెపై కన్నేసిన ఏపీ పోలీసులు.. ఆమె స్మగ్లింగ్ లీలలకు సంబంధించి పక్కా ఆధారాలు సంపాదించి ఆమెను అదుపులోకి తీసుకోవటానికి కోల్ కతాకు వెళ్లారు.  గడిచిన మూడు నెలల వ్యవధిలో దాదాపు రూ.10కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంగీత పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కోల్ కతాకు వెళ్లిన ఏపీ పోలీసులకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. పక్కా ఆధారాలతో సంగీతను ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సెట్ వారెంట్ తో చిత్తూరుకు తీసుకురావాలని ప్రయత్నించగా.. సంగీత తన రేంజ్ ఏమిటో చూపించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం పాతికమంది లాయర్లుకు సీన్లోకి వచ్చేసి ఆమెకు బెయిల్ ఇచ్చేపనిలో పడటమే కాదు.. క్షణాల్లో బెయిల్ తీసుకొని ఏపీ పోలీసుల నుంచి బయటకు వచ్చేయటం గమనార్హం. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయిన సంగీతను ఎలాగైనా అదుపులోకి తీసుకొని చిత్తూరు తీసుకురావాలన్న పట్టుదలతో ఏపీ పోలీస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ లేడీ డాన్ విషయంలో ఏపీ పోలీసులు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English