సాక్షి పత్రిక స్టాండ్ మార్చేసిందే..

సాక్షి పత్రిక స్టాండ్ మార్చేసిందే..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్- వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. బహిరంగంగా కనిపించకపోయినా వీళ్ల మధ్య తెలియని అనుబంధం ఉందని చాలాసార్లు రుజువైంది. గత ఎన్నికల సందర్భంగా కూడా ఇద్దరి మధ్య లోపాయకారీ ఒప్పందం నడిచిందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జగన్ ఆయనకు మరింత స్నేహశీలిగా మారిపోయారు. తెలంగాణలో తన పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినప్పటికీ.. కేసీఆర్‌ కు మద్దతుగా నిలవడం వల్ల రాజకీయ ప్రయోజనాలేమీ లేకపోయినప్పటికీ జగన్ ఆయన్ని ఇరుకున పెట్టే మాటలు ఏనాడూ మాట్లాడలేదు. హైదరాబాద్ తో తన ప్రయోజనాలు చాలా ముడిపడి ఉండటమే దీనికి కారణం కావచ్చు. ఇక జగన్ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక సైతం కేసీఆర్ విషయంలో ఎప్పుడూ ఆచితూచే వ్యవహరిస్తూ వస్తోంది. ఏనాడూ టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు వేసింది లేదు. ‘ఈనాడు’ తరహాలోనే పూర్తి అనుకూల వార్తలే వేస్తూ వస్తోంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రోజూ వార్తలు, కథనాలు ప్రచురిస్తూ.. ఇటువైపు తెలంగాణ ఎడిషన్లో మాత్రం సాత్వికమైన, ప్రభుత్వ అనుకూల వార్తలే వేస్తూ వచ్చింది.

అలాంటిది నిన్న సాక్షి పత్రిక చూస్తే ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రాజ్ పేరుతో ప్రచురించిన బేనర్ వార్త పూర్తి ప్రభుత్వ వ్యతిరేకమైందే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇంచార్జీలు ఎలా అవినీతికి పాల్పడుతోంది.. వ్యవస్థల్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటోంది వివరిస్తూ భారీ క్షేత్ర స్థాయి కథనమే వేశారు. అందులో కొందరు నాయకుల పేర్లు నేరుగా వేసేశారు. సాక్షి పత్రిక ఒక్కసారిగా ఇంత ధైర్యం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మామూలుగా అయితే ఇలాంటి పరిణామాల్ని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని ఈ కథనం వేయడంలో ఆంతర్యం వేరే ఉన్నట్లే తెలుస్తోంది. తెలంగాణలో తమ పార్టీకి మిగిలిన ఏకైక పెద్ద దిక్కు పొంగులేటి సుధాకర్ రెడ్డిని టీఆర్ఎస్ లాగేయడంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో జగన్.. అధికార పార్టీని ఇలా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. కేవలం ప్రజా సంక్షేమం కోసమే అయితే.. ఇన్నాళ్లూ ఎంతో జరుగుతున్నా ఎందుకు కళ్లు మూసుకున్నట్లో అన్న సందేహం రాకమానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు