జగన్ బ్యాచ్ ''వంటకం"లో లాజిక్ మిస్ అయ్యిందే

జగన్ బ్యాచ్ ''వంటకం

రెండు తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుళ్లు ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాల్ని సంధించి.. విపక్షాలకు వణుకు పుట్టేలా చేయటం తెలిసిందే. ఎందుకింత దూకుడుగా చంద్రుళ్లు వ్యవహరిస్తున్నారన్న విషయంలోకి వెళితే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరిగే అవకాశం ఉండటమేనని చెప్పటం తెలిసిందే. విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో హామీ ఇవ్వటం.. దీనికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఏన్డీయే సర్కారు సానుకూలంగా ఉందన్న సంకేతాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వలసల్ని భారీగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి.

పాత కాపుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడటం.. కొత్తగా పార్టీలో చేరే వారి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే పూచీకత్తు తమదన్న భరోసాను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన నేపథ్యంలో.. విపక్ష నేతలు ఒకరి తర్వాత ఒకరుగా క్యూ కడుతున్నారు. దీనికి బ్రేకులు వేసే విషయంలో రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు విఫలమవుతున్న పరిస్థితి. దీనికీ కారణం లేకపోలేదు. రోజులు గడిచే కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపక్షాలు బలోపేతం కావటం.. వాటిని ఎదుర్కొనే విషయంలో విపక్షాలు విఫలం కావటం.. విపక్ష నేతల్లో ఆ సామర్థ్యం లేకపోవటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

వలసలు మొత్తం పెరిగే అసెంబ్లీ స్థానాల మీద ఆశతోనే జరుగుతుందన్న మాటకు తగ్గట్లే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ పలు సభల్లో ఈ విషయాన్ని తమదైన శైలిలో ప్రస్తావిస్తున్నారు. మొన్నటికి మొన్న ముగిసిన తెలంగాణ అధికారపక్ష ప్లీనరీ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలో వేలాది పదవులు కట్టబెట్టనున్నట్లుగా చెప్పటమే కాదు.. తాను మంత్రిని కావటానికి పదిహేనేళ్లు వెయిట్ చేశానని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని.. కాస్త ఓపిక పడితే పదవులు పక్కా అంటూ భరోసా ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత పత్రిక సాక్షి ఒక చిత్రమైన వాదనను తెర మీదకు తెచ్చింది. వలసలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఒక కథనాన్ని తాజాగా ప్రచురించటం గమనార్హం. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సాగుతున్న అంచనాల మీద కేంద్రం ఏదైనా ప్రక్రియ ప్రారంభించారా?.. ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? లాంటి ప్రశ్నల్ని సంధించటం.. దానికి బదులుగా అలాంటివేమీ లేవని.. సమీప భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ.. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదని బదులిచ్చిందని చెబుతూ ఒక భారీ కథనాన్ని అచ్చేశారు.

దీనికి పలు నిబంధనలు.. 2014లో హోంశాఖకు.. ఎన్నికల సంఘానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్ని ప్రస్తావించారు. జగన్ పత్రిక వాదన ప్రకారం ఎన్నికల సంఘం అసెంబ్లీ.. పార్లమెంటునియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల సంఘం చెప్పటం. సాపేక్షంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే.. జంపింగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా తన వాదనను జగన్ పత్రిక అచ్చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సదరు కథనంలో పేర్కొన్నట్లుగా.. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు{తెలంగాణలో 119 నుంచి 153కు.. ఏపీలో 175 నుంచి 225 స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజు తలుచుకుంటే సవరణలు పెద్ద విషయం కాదు. పోలవరం ముంపు మండలాల విషయంలో ఎన్డీయే సర్కారు సింఫుల్ గా తేల్చేసి.. తెలంగాణకు చెందిన ఏడు మండలాల్ని ఏపీలో కలిపేస్తూ నిర్ణయం తీసుకోలేదు? అంతదాకా ఎందుకు అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా పూర్తి చేశారో తెలిసిందే. నిజంగా మోడీ సర్కారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఒకసారి డిసైడ్ అయితే సవరణలు పెద్ద విషయం కాదన్నది మర్చిపోకూడదు. ఇప్పటి పరిస్థితిని భవిష్యత్తుకు అపాదించి.. అందుకు సాయంగా నాలుగు సెక్షన్లను ప్రస్తావిస్తూ తయారు చేసిన 'వంటకం"లో లాజిక్ మిస్ అయ్యిందన్న వాదన వినిపిస్తోంది. మరి.. జగన్ బ్యాచ్ కు కౌంటర్ విన్నాక మీకేమనిపించింది..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు