తమ్ముళ్ల విమర్శలు వినలేదా పెద్దిరెడ్డి?

తమ్ముళ్ల విమర్శలు వినలేదా పెద్దిరెడ్డి?

రాజకీయాల్లో విమర్శలు మామూలే. రాజకీయ ప్రత్యర్థులపై ఏ తీరులో విమర్శలు చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎవరైనా నేత మీద విమర్శ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటమే కాదు.. తాము మాట్లాడే మాటల్లో నిజం ఎంత ఉంది? ప్రజలకు మేలు కలిగేలా వాదన వినిపిస్తున్నామా? లాంటి చాలానే ప్రశ్నలు నేతలు ఎవరికి వారు వేసుకునేవారు. అయితే.. అలాంటి సత్యకాలం పోయి చాలానే రోజులై.. దుర్మార్గమైన దూకుడు రాజకీయాలు పెరిగిపోయిన పరిస్థితి.

ఇప్పుడు విమర్శ చేయటానికి పెద్ద కారణం ఉండాల్సిన అవసరం లేదు. చివరకు వ్యక్తిగత అవసరాలకు కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే ధోరణి పెరిగిపోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ మధ్య జేసీ దివాకర్ రెడ్డి చెప్పినట్లుగా.. విభజన తర్వాత ఏపీ బలం చిక్కిపోవటం.. కేంద్రంలో మోడీ పూర్తిస్థాయి మెజార్టీతో ఉన్న నేపథ్యంలో.. ''బోడిలింగం""గా మారిపోయామని.. మోడీకి ఏపీ అస్సలు పట్టటం లేదని సూటిగానే అసలు విషయాన్ని చెప్పేయటం తెలిసిందే.

బలమైన కేంద్రంతో గొడవ పెట్టుకుంటే కలిగే ప్రయోనం శూన్యమన్న విషయం అందరికి తెలిసిందే. ఇక.. మోడీ లాంటి నేతతో గొడవకు దిగటం వల్ల ఏపీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలతో మంట పుట్టిస్తున్నా మిత్రధర్మం పేరిట ఆచితూచి అడుగులు వేస్తోంది ఏపీ సర్కారు. ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ ఈ మధ్యన కేంద్రమంత్రులు చేసిన వరుస ప్రకటనల విషయంలో ఏపీ టీడీపీ తమ్ముళ్లు ఎంతలా చెలరేగిపోయింది తెలిసిందే.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఏపీ విభజన సందర్భంగా కేంద్రం తీరును ఏపీ కాంగ్రెస్ నేతలు ఎండగట్టిన దానితో పోలిస్తే.. తమ మిత్రపక్షంపై టీడీపీ తమ్ముళ్లు ఎక్కువగానే చెలరేగిపోయారని చెప్పకతప్పదు. అయినప్పటికి ఏపీ ముఖ్యమంత్రి ఏదో కేంద్రానికి వంత పలుకుతున్నట్లుగా.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్నట్లుగా కొందరు సీనియర్ విపక్ష నేతలు విమర్శలు చేయటం గమనార్హం. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే.. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ సర్కారు సమాధి సిద్ధం చేస్తే.. దాని నిర్మాణానికి అవసరమైన ఇటుకల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే.. గడిచిన కొద్ది రోజులుగా మోడీ సర్కారుపై ఏపీ తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో పెద్దరెడ్డి వినటం లేదా? విననట్లుగా ఉంటున్నారా..? ఉత్త విమర్శలతో కాలక్షేపం చేసే కన్నా.. హోదా విషయంలో ఏపీ అధికార.. విపక్షాలు చేతులు కలిపి పోరాడటం మంచిదన్న విషయాన్ని పెద్దిరెడ్డి లాంటి వారు గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు