పోలీసుపై ఎంఐఎం జులుం చూశారా?

పోలీసుపై ఎంఐఎం జులుం చూశారా?

మోటార్‌ వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించిన పోలీసుల‌పై ఎంఐఎం ప్ర‌జాప్ర‌తినిధి చొక్కాప‌ట్టుకొని లాగ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.  'నా కొడుకునే పట్టుకుంటారా..' అంటూ ఎంఐఎం నాయకుడు, నగర డిప్యూటీ మేయర్‌ ఫయిమొద్దీన్‌ ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ చొక్కా పట్టిలాగి దాడి చేశాడు.  అతని కుమారుడిని పట్టుకున్న ట్రాఫిక్‌ పోలీసులపై దాడికి దిగాడు. ఈ సంఘటన మధ్యాహ్నం నిజామాబాద్‌ బస్టాండ్‌ ఎదురుగా జరిగింది.

వన్‌టౌన్‌ పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు బస్టాండ్‌ ఎదుట మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో నెంబర్‌ లేని ద్విచక్రవాహనం రావడంతో ఏఎస్‌ఐ శ్యాంకుమార్‌ అడ్డుకున్నారు. బైకుకు సంబంధించిన ధ్రువపత్రాలు అడిగారు. తాను డిప్యూటీ మేయర్‌ కుమారుడినని బషీర్‌ అద్నాన్‌ నిర్లక్ష్యపు సమాధాన మిచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రక్షక్‌ జీపులో ఎక్కించారు. ఈ విషయాన్ని అద్నాన్‌ తండ్రికి ఫోన్‌లో సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫయిమొద్దీన్‌ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ట్రాఫిక్‌ సిబ్బందితోపాటు అక్కడే ఉన్న ఏఎస్‌ఐ శ్యాంకు మార్‌పై చిందులేశాడు. ఏఎస్‌ఐ చొక్కా పట్టుకుని వీరంగం సృష్టించాడు. 'నా కొడుకునే పట్టుకుంటారా..' అంటూ నానా దుర్భాషలాడాడు. అనంతరం జీపులో ఎక్కించిన తన కుమారుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏఎస్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, ఒకటో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌ ఫయిమొద్దీన్‌పై 357 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో నాగం రవీందర్‌ తెలిపారు.

పోలీసుల‌పై హైద‌రాబాద్‌లోనే ఎంఐఎం ఇబ్బందిక‌ర ప్ర‌వ‌ర్త‌న గ‌తంలో చ‌ర్చ‌నీయాంశంగా కాగా ఇపుడు అది జిల్లాల‌కు పాక‌డంపై అధికారుల్లో చ‌ర్చ మొద‌ల‌వుతోంది. ఈ తీరును బ్రేకులు వేయ‌క‌పోతే ప‌రిపాల‌న‌లో జోక్యం పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఆయా వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.