చంద్రబాబును మనసు పిండేసిన మంత్రి

చంద్రబాబును మనసు పిండేసిన మంత్రి

చంద్రబాబు అంటే పని రాక్షసుడని పేరు.. తాను నిద్రపోకుండా, తన టీంని నిద్రపోనికవ్వకుండా చేసి పనులు పూర్తిచేస్తారని చెబుతారు. అలాంటి చంద్రబాబుకు ఎవరైనా కష్టపడి పనిచేయడం కనిపించినా.. కష్టకాలంలో పనిపై శ్రద్ధ చూపినా తెగ ముచ్చటేస్తుందట. తాజాగా టీడీపీ మంత్రి ఒకరు ఒళ్లంతా గాయాలతో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ మంత్రి చిత్తశుద్ధిని చూసి చంద్రబాబు చాలా సంతోషించారట. అదేసమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెంది ఎలా ఉందని పరామర్శించి రెస్టు తీసుకోమని సలహా కూడా ఇచ్చారట. అలా చంద్రబాబు మనసు చూరగొన్న ఆ మంత్రివర్యులు మరెవరో కాదు... మొన్నమొన్న గోరంట్ల బుచ్చయ్య ఫిర్యాదుల పుణ్యమా అని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో తిట్లు తిన్న ఎక్సయిజ్ మంత్రి కొల్లు రవీంద్ర.

కొల్లు రవీంద్ర మొన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో ఆయన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రతో పాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత రవీంద్ర విజయవాడ వచ్చేశారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోవడం అంత ఈజీ కాదు. కానీ కొల్లు రవీంద్ర మాత్రం ఆ దుర్ఘటన నుంచి వెంటనే తేరుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడితో కలిసి హాజరయ్యారు. రవీంద్ర గాయపడ్డారన్న సమాచారంతో ఆయన కనిపించగానే చంద్రబాబు పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రమాదాన్ని చంద్రబాబుకు వివరించిన రవీంద్ర... తనకైన గాయాలు స్వల్పమైనవేనని చెప్పడమే కాకుండా వాటిని చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా మిగిలిన మంత్రులు, టీడీపీ నేతలు కూడా రవీంద్రను పరామర్శించారు. గాయపడినా కూడా ఎందుకు వచ్చేశావ్.. రెస్టు తీసుకోవాల్సింది అని చంద్రబాబు జాగ్రత్తలు చెప్పారట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు