తమ్ముడి పై అన్న సవాలు

ఇంతకాలం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విషయంలో మౌనం వహించిన అన్నయ్య అళగిరి ఒక్కసారిగా బరస్టయ్యారు. మధురైలో పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తన తమ్ముడు ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేడంటు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పార్టీ పగ్గాల కోసం చాలా కాలంగా అన్న, తమ్ముళ్ళ మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. వివిధ కారణాలతో కరుణానిధి ఉన్నపుడు అళగిరిని పార్టీ నుండి స్టాలిన్ బయటకు వెళ్ళగొట్టేలా ప్లాన్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నవే.

సరే కారణాలు ఏవైనా కరుణానిధి మరణం తర్వాత అన్న దమ్ములిద్దరు విడిపోయారు. చాలాకాలం అళిగిరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయారు. అయితే ఈమధ్య తన మద్దతుదారులతో తరచు సమావేశాలు జరపుతున్నారు. వచ్చే మేనెలలలో షెడ్యూల్ ఎన్నికలు జరగాల్సుంది. ఈ నేపధ్యంలోనే అళగిరి రాజకీయాలు మళ్ళీ స్పీడందుకున్నాయి. బీజేపీలో చేరి ఎన్నికల్లో యాక్టివ్ అవుతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తానే కొత్తగా ఓ పార్టీ పెడతారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది.

జరుగుతున్న ప్రచారాలు ఎలాగున్నా మదురై సమావేశంతో మళ్ళీ యాక్టివ్ అయ్యారన్నది వాస్తవం. డీఎంకేలో తనకు జరిగిన అవమానాలను వివరించారు. తన సోదరుడు స్టాలిన్ను తాను ఎంతగా ప్రోత్సాహించింది వివరించి చెప్పాపరు. పార్టీ కోశాధికారిగా, డిప్యుటీ ముఖ్యమంత్రిగా స్టాలిన్ను తాను ప్రోత్సహించిన వైనాన్ని చెప్పారు. స్టాలిన్ కోసం తాను ఇంత చేస్తే సోదరుడు తనను ఎంతగానో అవమానించారని బాధపడ్డారు.

పార్టీ పటిష్టానికి తాను చేసిన కృషిని వివరించారు. దక్షిణ తమిళనాడులో పార్టీ పటిష్టానికి, గెలుపుకు తాను పడిన కష్టాన్ని చెప్పుకున్నారు. మొత్తంమీద సంవత్సరాలుగా స్టాలిన్ పై తనలో పేరుకుపోయిన ఆగ్రహాన్ని అళగిరి ఒక్కసారిగా బయటకు కక్కేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో అళగిరి స్టాలిన్ పై ఇలా విరుచుకుపడటంతో పార్టీలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో స్టాలిన్ సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం కూడా చెప్పేశారు. అళగిరి వ్యాఖ్యలు చూస్తుంటే తమ్ముడు అధికారంలోకి రాకుండా తెరవెనుక ఏదో పెద్ద కతే మొదలుపెట్టినట్లున్నారు.