బాబుపై కోడెల నియోజకవర్గంలో అసంతృప్తి

బాబుపై కోడెల నియోజకవర్గంలో అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు నియోజకవర్గంలో అసంతృప్తి రాజుకుంటోంది. కోడెల ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ {జేఎన్టీయూ-కె} కళాశాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వేసిన అస్పష్ట అడుగే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.

ఆరు నెలల క్రితం.. 2015 డిసెంబరులో నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'జేఎన్టీయూ గుంటూరు జిల్లాలోనే ఏర్పాటవుతుంది.. అదీ నరసరావుపేటకే వస్తుందని" ప్రకటించారు. దీంతో అప్పటి వరకు అలుముకున్న అనుమానాలు తొలగిపోయాయి. ఇక ఏర్పాటు లాంఛనమేనని అంతా భావించారు. అయితే ఆరు నెలలు గడుస్తున్నా దీనిపై పురోగతి లేకపోవడం.. పైగా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం పారిశ్రామిక వాడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో మరోసారి నీలి నీడలు అలుముకున్నాయి. ఇంజినీరింగ్ విద్యకు కేంద్రంగా మారిన నరసరావుపేటలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విద్యాసంస్థకు సరిపడా స్థలం అందుబాటులో ఉండడం, విశ్వవిద్యాలయ అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి అన్ని విధాలా అనుకూలంగా ఉందని ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. పల్నాడు ప్రాంతానికి కీలకమైన నరసరావుపేటలో కళాశాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమయింది. ప్రతి విషయానికి జేఎన్టీయూ కాకినాడకు వెళ్లాల్సి రావడం దూరభారం అవుతుండడంతో భవిష్యత్తులో ఇక్కడి కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని... గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహకులు, అధ్యాకులు, విద్యార్థులకు కాకినాడ వెళ్లే అవసరం తప్పుతుందని భావించారు. అయితే ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వెళ్లిన ప్రతిపాదనల మేరకు ఇది జరిగిందని సమాచారం.

ప్రభుత్వం పారిశ్రామిక వాడకు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది కాబట్టి మళ్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి స్వయంగా ఆయన స్పందించాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. అసలు పారిశ్రామిక వాడకు ప్రతిపాదించిన స్థలం ఎక్కడుంది? కళాశాలకు కేటాయించమన్న స్థలం ఎక్కడుందనే విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. రెండు ప్రతిపాదిత స్థలాలు వేర్వేరు అన్నట్లుగా వ్యవహరించడం, ఈ గందరగోళంలో మొదట వెళ్లిన దస్త్రం మేరకు ఏపీఐఐసీకి కేటాయింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసింది. దీంతో అనవసర వివాదానికి బీజం పడిందని అంటున్నారు. అయితే నరసరావుపేట వాసుల ఆశలపై నీళ్లు చల్లిన నేపథ్యంలో అక్కడ అసంతృప్తి రాజుకున్నదని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు