రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడ్డుకుంటున్న జగన్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడ్డుకుంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో రాజకీయంగా పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితికి కారకులు మీరంటే మీరేనని అధికార-ప్రతిపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొత్త ఆరోపణ చేశారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నది వైసీపీ అధినేత జగన్ అని ఆరోపించారు.

తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరుగుతున్న తెదేపా రాయలసీమ స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జరగడం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే ఆయన దిల్లీ స్థాయిలో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ప్రచారం వల్లే ప్రత్యేక హోదా విషయంలో నీలి మబ్బులు కమ్ముకున్నాయని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై సందర్భానుసారం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. త్వరలో మరోమారు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారని ప్రకటించారు. రానున్న రెండు, మూడు నెలల్లో వైకాపా ఖాళీ కావడం ఖాయమని మంత్రి రవీంద్ర జోస్యం చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు