బాబు కంటే ముందున్న ప్రభుత్వ విభాగం

బాబు కంటే ముందున్న ప్రభుత్వ విభాగం

ఈ జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పూర్తిస్థాయి పరిపాలనను నిర్వహించాలన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు పలు ప్రభుత్వ శాఖలు మొండికేస్తున్నా మరికొన్ని సంస్థలు వేగంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ క్రమంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఏకంగా మే15 నుంచి విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఇందుకోసం ఆర్టీసీకి చెందిన పరిపాలనా కార్యాలయాల భవన నిర్మాణం పనులు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్{పీఎన్బీఎస్}లో జోరుగా సాగుతున్నాయి. మే 15 నుంచి హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులు 90శాతం ఇక్కడికి చేరుకోనున్నారు. కేవలం 10శాతం మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారు. మిగతా వారంతా విజయవాడ నుంచే విధులు నిర్వహిస్తారు.

పీఎన్‌బీఎస్‌లో ఇప్పటికే అధునాతన వసతులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే మోడల్ బస్టాండ్‌గా తీర్చిదిద్దారు. కుర్చీలు, బస్సుల సమాచారం తెలిపే డిస్ప్లే బోర్డులు, భారీ టీవీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. గతంలో ఖాళీగా ఉన్న స్థలాన్నంతటినీ వినియోగంలోనికి తెచ్చారు. పీఎన్‌బీఎస్‌కు వెనుక వైపు ఖాళీగా ఉన్న స్థలంలో ఆర్టీసీ ఎండీ కార్యాలయం, కాన్ఫరెన్స్ హాలు, బస్‌హౌస్ సర్వహంగులతో సిద్ధమయ్యాయి. డిపార్చర్ బ్లాక్‌లోని స్థలంలో సినిమా థియేటర్ కడుతున్నారు. తాజాగా ఆర్ఎం కార్యాలయం పైన ఉన్న ఖాళీ స్థలాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు మూడంతస్థుల్లో నిర్మాణాలను చేపడుతున్నారు. వీటిలో ఒక అంతస్థును పరిపాలన భవనాల కోసం సిద్ధం చేస్తున్నారు. మిగతా రెండు అంతస్తులను ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు నిర్మిస్తున్నారు. 90శాతం ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తికానందున వాటి నిర్వహణతో పాటూ సర్వీసులకు సంబంధించిన పర్యవేక్షణ కోసం 10శాతం సిబ్బందిని అక్కడే ఉంచనున్నారు. ఎవరెవరిని అక్కడ ఉంచాలి, ఎవరు ఇక్కడికి రావాలనే దానిపైనా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మే 15 తర్వాత విజయవాడ కేంద్రంగానే పరిపాలనా వ్యవహారాలను సాగించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు సైతం స్పష్టం చేశారు.

విజయవాడకు కీలకమైన ప్రాంతంలో పీఎన్బీఎస్ ఉండడంతో ఇక్కడ తమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పలు ఇతర ప్రభుత్వ శాఖలు ఆసక్తి చూపుతున్నాయి. అటు అమరావతి, ఇటు విజయవాడకు రాకపోకలు సాగించేందుకూ ఇక్కడి నుంచి అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖకు చెందిన ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ సహా ముఖ్యమైన విభాగాలు సైతం తమ కార్యాలయాల ఏర్పాటు కోసం ఆర్టీసీని సంప్రదించాయి. రవాణాశాఖ, కార్మికశాఖ కార్యాలయాలనూ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పీఎన్బీఎస్ పైన మూడు అంతస్థుల్లో 1.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తున్నారు. మొదటి అంతస్థును ఆర్టీసికి వినియోగించి, మిగతా రెండు ఇతర ప్రభుత్వశాఖలకు అద్దెకు కేటాయించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటికి అద్దెను నిర్ణయిస్తారు. దీనివల్ల ఆర్టీసీకి సైతం ఆదాయం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే ఒక్కో ఫ్లోర్‌కూ రూ.8 కోట్లను వెచ్చించి నిర్మిస్తున్నారు. మిగతా రెండు అంతస్థులకూ శ్లాబ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫ్లోరింగ్ వేసి, అనంతరం లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు ఫ్లోర్లు సైతం మరో రెండు మూడు నెలల్లో సిద్ధం కానున్నాయి. ఈ కార్యాలయాల కోసం ప్రత్యేకంగా పీఎన్‌బీఎస్‌లో రహదారులను సైతం వేస్తున్నారు. పరిపాలన భవనానికి ప్రత్యేకంగా రైల్వేలైన్ వైపు కొత్తగా ముఖద్వారాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా పరిపాలన కేంద్రాన్ని తరలించడంలో ప్రభుత్వం కంటే ఏపీఎస్ఆర్టీసీ ముందుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు