తెలుగు రాజ‌కీయాల్లో ఎన్ని చిక్కు ప్ర‌శ్న‌లో

తెలుగు రాజ‌కీయాల్లో ఎన్ని చిక్కు ప్ర‌శ్న‌లో

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎవ‌రు ఎటు వైపు మొగ్గు చూపుతారో.. ఎవ‌రు ఎవ‌రికి మిత్ర‌ప‌క్షం అవుతారు.. ఎవ‌రు శ‌త్రువులో.. అర్థం చేసుకోవాలంటే చిక్కుప్ర‌శ్నే! ఇది తెలుగురాష్ట్రాల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఏపీలో మిత్ర ప‌క్షంగా ఉన్న రెండు పార్టీలు.. ఎప్పుడు విడిపోతాయో తెలియదు! ఈలోగా మ‌ధ్య‌లో పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంట‌రిగా పోటీ చేస్తానంటున్నాడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా `ఒక్క చాన్స్‌` ఎప్పుడొస్తుందా?  సీఎం ఎప్పుడ‌యిపోదామా? అని ఆశ‌గా ఎదురుచూస్తున్నాడు.!! ఇక తెలంగాణ‌లో.. టీఆర్ఎస్-బీజేపీల మ‌ధ్య స్నేహ ప‌వ‌నాలు వీచే అవ‌కాశముంది. ఇక టీడీపీని బీజేపీ దూరం..దూరం అంటోంది. ఇప్పుడు  2019పై ఎవ‌రికి వారు అంచ‌నాలు వేసుకుంటున్నారు.

2019 ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది. రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటి నుంచే పావులు క‌దుపుతున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రంలో ప్రాధాన్యత త‌గ్గంది. ఇక నుంచి చక్రం తిప్పే పనిలో కేసీఆర్‌ ఉంటాడని జ్యోతిష్కులు ఉగాదికి చెప్పారు. బీజేపీతో కలిసి రాష్ట్రంలో 2019లో పోటీకి కేసీఆర్‌ దిగుతాడని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు కేసీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఆంధ్రాలో టీడీపీతో తెగతెంపులు చేసుకోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బాబు, కేసీఆర్‌ చుట్టూ రాజకీయాలు ఇలా కొనసాగుతుంటే.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. కాపుకులం పేరిట ఆంధ్రాలో కొంత నడిచిన తెలంగాణలో పవన్‌ ప్రభావం పెద్దగా ఉండ‌ద‌నే చెప్పుకోవ‌చ్చు.

ఇక జ‌గ‌న్ ప్ర‌భావం తెలంగాణ‌లో లేక‌పోయినా.. ఏపీలో 2019కి ఎలా ఉంటుంద‌నే చెప్పుకోవాలి. కేంద్రంలో ప్రస్తుతం జరుగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ భవిష్యత్‌ తేటతెల్లమవుతుంది. ప్రజలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారో తెలిసిపోతే భవిష్యత్‌ను ఇట్టే అంచనా వేయవచ్చు. మోడీని ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్‌ అనే స్పెషలిస్టును ప్రస్తుతం తెలంగాణకు కాంగ్రెస్ నాయ‌కులు రప్పించారు. ఆయ‌న సూచనలను తీసుకుని భవిష్యత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ను ఎదుర్కుంటారట. మ‌రి ప్ర‌స్తుతం అవ‌కాశ వాద రాజ‌కీయాలు ఏ స్థాయికి వెళ‌తాయో!!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు