కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు బాబు స్కెచ్ రెడీ

కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు బాబు స్కెచ్ రెడీ

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం నెమ్మదిగా మబ్బులను తొలగిస్తోంది. ప్రత్యేక హోదా ఆలోచనే కేంద్రానికి లేదని, అందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామదాన భేద దండోపాయాలను ప్రయోగించినా అనుకున్న ఆశయం నెరవేరకపోవడంతో కేంద్రాన్ని దారికి తేచ్చే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రం లో విస్తృతమైన చర్చ గత రెండేళ్లలో జరిగింది. సమయం వచ్చిన ప్రతిసారీ కేంద్ర మంత్రులు కూడా ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, కేంద్రం తిరస్కరించలేదని కూడా చెబుతూ వచ్చారు. తీరా అసలు విషయానికి వచ్చేసరికి కేంద్రం చేతులు ఎత్తేయడాన్ని టీడీపీ జీర్ణం చేసుకోలేకపోతోంది. ప్రధానిని కలిసిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై ప్రస్తావన చేయడమేగాక, అసెంబ్లీలో కూడా ఇందుకు తీర్మానం చేశారు. ప్రధానికి చంద్రబాబు అనేక మార్లు లేఖలు రాశారు, కేంద్ర మంత్రులు నేరుగా ప్రధానిని కలిసి ఈ అంశంపై ప్రస్తావించినా పని జరగకపోవడంపై టీడీపీ కింకర్తవ్యంలో పడిపోయింది. కేంద్రానికి మద్దతు కొనసాగిస్తూనే మంత్రివర్గం నుండి మాత్రం టీడీపీ తప్పుకోవడమే ఈ దశలో ఉత్తమమైనదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుండగా, దానికి సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర క్యాబినెట్లో టీడీపీ మంత్రులను కొనసాగించినా, కేంద్రంలోని క్యాబినెట్ నుండి మంత్రులను తప్పించడం తుది ప్రత్యామ్నాయంగా యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులున్నారు. అందులో ఇద్దరు తెలుగు దేశం పార్టీ వారు కాగా, మరో ముగ్గురు బిజెపికి చెందిన వారు. ఎం వెంకయ్యనాయుడు, పి అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, వై ఎస్ చౌదరి మంత్రులుగా ఉన్నారు. వీరిలో పి అశోక్ గజపతి రాజును, వైఎస్ చౌదరిని మంత్రిపదవుల నుండి రాజీనామా చేయించడం ద్వారా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. మరో పక్క రాష్ట్రంలోనూ బిజెపి మంత్రులు మంత్రివర్గం నుండి తప్పుకుంటే వారిస్థానంలో ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారిని మంత్రిపదవుల్లోకి తీసుకోవాలని టిడిపి నేతలు చెబుతున్నారు.

రెండేళ్లుగా ప్రత్యేక హోదాను ఊరిస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం ఇపుడు మాట మార్చి అవసరమైన మేర ఆర్ధిక సాయం చేస్తామని, ప్రత్యేక హోదా అవసరం లేదనడంతో ఈ అంశంపై విపక్షం చేసే రచ్చపై టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి చౌదరి చూచాయిగా చెప్పగా, అలాంటి ఆలోచన కేంద్రం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేయడంతో టీడీపీ ఇరకాటంలో పడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు