‘అగస్టా’ కుంభకోణంలో వైఎస్ అల్లుడుగారు..

‘అగస్టా’ కుంభకోణంలో  వైఎస్  అల్లుడుగారు..

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మంచి లైమ్ లైట్లో ఉండేవారన్న సంగతి తెలిసిందే. అప్పటికి సాధారణ మత ప్రచారకుడిగానే ఉన్న అనిల్ కుమార్ వైఎస్ అండగా ప్రముఖ మత ప్రచారకుడిగా ఎదిగిపోయారు. ఆయనపై పలు ఇతర ఆరోపణలు కూడా వచ్చాయి. బయ్యారం గనులు, ఎన్నికల సందర్భాల్లో డబ్బు పంపిణీ వ్యవహారాల్లోనూ ఆయన ప్రమేయంపై ఆరోపణలుండేవి. ఒక ఎన్నికల సమయంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి హెలికాప్టర్లో వచ్చి డబ్బు తరలించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. హైరేంజి మత ప్రచారకుడిగా పేరున్న ఆయన రాజశేఖరరెడ్డి తదనంతరం పెద్దగా వార్తల్లో లేరు. కానీ, తాజాగా ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది.  దేశాన్ని, చట్టసభలను కుదిపేస్తున్న అగస్టా వెస్టులాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో బ్రదర్ అనిల్ కుమార్ పేరు వినిపిస్తోంది. టీడీపీ నేత సీఎం రమేశ్ ఈమేరకు తాజాగా చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం రేపాయి.

అగస్టా వెస్టు ల్యాండ్ కుంభకోణంలో ఉన్న హష్కీతో బ్రదర్ అనిల్ కు సంబంధాలున్నాయని టీడీపీ నేత సీఎం రమేష్ అన్నారు. ఈ విషయమై ఖమ్మంలో జిల్లాలో ఆయనపై కేసు కూడా నమోదైందన్నారు. ఈ విషయమై 2012లోనే రాజ్యసభలో తాను ప్రస్తావించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటపడతాయని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. కాగా, అగస్టా వెస్టు ల్యాండ్ చాపర్ డీలర్ పై రక్షణ మంత్రి పారికర్ ఈరోజు పార్లమెంట్ లో ఒక ప్రకటన చేయనున్న నేపథ్యంలో రమేశ్ ఆరోపణలు సంచలనం రేపాయి. పారికర్ ప్రకటనలో ఏమేం అంశాలు ఉంటాయో.. ఎవరెవరి పేర్లు ఉంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు